కదం తొక్కిన విజయ్‌ సేన | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన విజయ్‌ సేన

Apr 5 2025 12:17 AM | Updated on Apr 5 2025 12:17 AM

రాష్ట్ర వ్యాప్తంగా నిరసన హోరు

సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేత విజయ్‌ ఆదేశాలతో ఆపార్టీ వర్గాలు కదం తొక్కాయి. వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన హోరెత్తించారు. శుక్రవారం అన్ని చోట్ల విజయ్‌ పార్టీ వర్గాలు నిరసనలను విజయవంతం చేస్తూ ముందుకు దూసుకెళ్లారు. పార్లమెంట్‌, రాజ్యసభలలో వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకేలు వ్యతిరేకించాయి. తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌, రాజ్యసభ సభ్యుడు, సంగీత దర్శకుడు ఇళయరాజా మద్దతుగా ఓటు వేసినట్టు తెలిసింది. పీఎంకే రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రాందాసు వాకౌట్‌ చేశారు. ఈ పరిస్థితులలో ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా టీవీకే నేతృత్వంలో భారీ నిరసనలకు విజయ్‌ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీవీకే శ్రేణు కదం తొక్కాయి. ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కొన్ని చోట్ల వీరి నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదాలు, తోపులాటలు తప్పలేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కారులు నినాదాలు హోరెత్తించారు. చైన్నెలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ నేతృత్వంలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈసీఆర్‌ మార్గంలోని పనయూరు వద్ద భారీ రాస్తారోకో జరగ్గా పోలీసులు అడ్డుకున్నారు. వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా విజయ్‌ ఇచ్చిన పిలుపుమేరకు తాజాగా జరిగిన నిరసన రాస్ట్రవ్యాప్తంగా విజయవంతం కావడంతో టీవీకే వర్గాల్లో మరింత జోష్‌ నెలకొంది. కాగా, ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈనెల 8న రాస్ట్రవ్యాప్త నిరసనకు వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్‌ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement