‘మారీశన్’
సూపర్ గుడ్ ఫిలిమ్స్
బ్యానర్‌లో
తమిళ సినిమా: సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సంస్థ అధినేత ఆర్బీ చౌదరి తమిళం, తెలుగు తదితర భాషల్లో ఇప్పటికీ 97 చిత్రాలు నిర్మించారు. ప్రతిభావంతులైన నూతన కళాకారులను ప్రోత్సహించడంలో ఈయన ముందు ఉంటారు. అదేవిధంగా కథలను నమ్మి చిత్రాలు చేసే నిర్మాత ఈయన.కాగా తాజాగా ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న చిత్రం మారీశన్. ఇందులో మలయాళ నటుడు ఫాహత్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నటుడు వివేక్ ప్రసన్న, నటి రేణుక, సితార, తదితరులు ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి వి. కృష్ణమూర్తి కథ, కథనం, మాటలు అందిస్తూ క్రియేటివ్ దర్శకుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా సుదీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, కలైసెల్వన్ శివాజీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వైవిధ్య భరితంగా సాగే ట్రావెలింగ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మామన్నన్ చిత్రం తర్వాత ఫాహత్ ఫాజిల్, వడివేలు మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం కావడం, దీన్ని సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తుండడంతో మారీశన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను యూనిట్ వర్గాలు విడుదల చేశారు.
మారీశన్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్
‘మారీశన్’


