సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులపై డీఎంకే సర్వే చేపట్టి ఉండడం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా జరిగిన ఈసర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 50 స్థానాల్లో భారీ ఆధిక్యతతో డీఎంకేకు గెలుపు ఖాయం అన్నది స్పష్టమైంది. అలాగే, మరికొన్ని స్థానాల్లో కూటమి గెలుపు ఖాయం అన్నది తేలింది. అదే సమయంలో కొన్ని చోట్ల స్వల్ప మెజారిటీతో గెలుపు ధ్రువీకరించడం గమనార్హం. మళ్లీ అధికారం లక్ష్యంగా డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెట్టిన విషయం తెలిసింది. ఈసారి ఎన్నికల సమరం రసవత్తరంగా ఉండడమే కాకుండా హోరా హోరీ అనేది అనేక నియోజకవర్గాలలో ఉండవచ్చు అన్న సంకేతాలు నెలకొన్నాయి. తమిళగ వెట్రి కళగంతో రాజకీయ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో యువత, నవతరం ఓట్లు చీలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అభిమానుల సంఖ్య అధికం కావడంతో ఆయన ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించబోతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో గత కొన్ని నెలలుగా సర్వే నిర్వహించి ఉండడం గమనార్హం. తమ ఓటు బ్యాంక్‌కు ఢోకా లేదన్నట్టుగా ఈ సర్వే స్పష్టం చేసినట్టు సమాచారం.
గెలుపు రేసులోనే....
రాష్ట్రంలోని 234 స్థానాల్లో ఈ సర్వే నిర్వహించారు. గత ఎన్నికల్లో 130కు పైగా స్థానాలలో డీఎంకే గెలిచింది. ఈ నియోజకవర్గాలలో ప్రస్తుత పరిస్థితులపై ప్రధానంగా సర్వే చేశారు. ఇందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 50 చోట్ల భారీ ఆధిక్యంతో గెలుపు ఖాయం అన్నది సర్వేలో తేలింది. అలాగే, మరికొన్ని చోట్ల డీఎంకే సిట్టింగ్‌లపై అసంతృప్తి రగులుతోంది. వీరికి బదులుగా ఇతరులను పోటీలో నిలబెట్టిన పక్షంలో గెలుపు ఖాయం అని తేలింది. ఇంకొన్ని స్థానాల్లో గెలుపు హోరాహోరీగా ఉంటుందని, స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశాలు ఉన్నట్టు తేలింది. ఇక, మిగిలిన నియోజకవర్గాలలో డీఎంకే బలం ఏ మేరకు ఉందో అని సర్వే చేశారు. ఇందులో కొన్ని కూటమి పార్టీలకు గెలుపు అవకాశాలు ఉన్నా, మరి కొన్ని చోట్ల కూటమి అభ్యర్థులకన్నా డీఎంకే అభ్యర్థి పోటీలో ఉండాలన్న నినాదం కొనసాగడం గమనార్హం. ఈ సర్వే ఆధారంగా మరింతగా ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టబోతున్నారు. సిట్టింగ్‌ల పనితీరు అసంతృప్తికరంగా ఉన్న చోట్ల కొత్త వారిని ఇన్‌చార్జ్‌లుగా నియమించి ఈ ఏడాది కాలం పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పనులు వేగవంతం చేయడానికి డీఎంకే అధిష్టానం వ్యూహరచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ దృష్ట్యా, ఈసారి అనేక మంది సిట్టింగ్‌లకు సీట్లు చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


