వేలూరు: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని అదనపు డీజీపీ డేవిడ్‌సన్ ఆశీర్వాదం పోలీసులను ఆదేశించారు. గురువారం వేలూరు వచ్చిన ఆయన డీఐజీ కార్యాలయాన్ని తనఖీ చేశారు. అనంతరం పోలీసుల బదిలీల ఫైల్, కేసుల వివరాలను డీఐజీ దేవరాణి, ఎస్పీ మదివాణన్‌లతో సమీక్షించారు. ఆ సమయంలో డీఐజీ కార్యాలయానికి వచ్చిన ఒక కుటుంబాన్ని ఆయన విచారణ జరిపారు. ఆ సమయంలో తన భర్త తనను మోసం చేసి ఇంట్లో ఉన్న బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొని వేరే మహిళను వివాహం చేసుకున్నాడని, దీనిపై గత జూలై మాసంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వినతిని స్వీకరించిన ఏడీజీపీ వెంటనే వీటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం, కాట్పాడి, అనకట్టు, గుడియాత్తం వంటి పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసి పెండింగ్ కేసులపై ఆరా తీశారు. సాయంత్రం వేలూరు ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని సీఐలతో శాంతి భద్రతలపై సమీక్షించారు.


