సేలం : హద్దులుదాటి చేపలు పట్టారని ఆరోపిస్తూ లంక సేనలు అరెస్టు చేసిన తమిళ జాలర్లు 13 మందిని శ్రీలంక కోర్టు విడుదల చేసింది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ పాస్‌పోర్టు ద్వారా శ్రీలంక నుంచి చైన్నెకి వచ్చిన జాలర్లను సొంత ఊర్లకు ప్రభుత్వ అధికారులు పంపించారు. వివరాలు.. రాష్ట్రం నుంచి గత జనవరి నెల 27వ తేది మైలాడుదురై జాలర్లు ముగ్గురు, నాగపట్నం జాలర్లు నలుగురు, కారైక్కాల్ జాలర్లు ఆరుగురు సహా మొత్తం 13 మంది రెండు మర పడవల్లో సముద్రంలో చేపల వేటకు వెల్లారు. అర్ధరాత్రి సమయంలో అక్కడికి గస్తీకి వచ్చిన శ్రీలంక సముద్రతీర బలగాలు హద్దులుదాటి చేపలు పట్టారని ఆరోపిస్తూ 13 మందిని అరెస్టు చేసి, రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో శ్రీలంక బలగాలు జరిపిన కాల్పుల్లో కారైకల్‌కు చెందిన జాలరి సెంతమిళ్ (27) గాయపడినట్టు తెల్తస్తోంది. తర్వాత జాలర్లను శ్రీలంక కోర్టులో హాజరుపరిచి జైలులో బంధించారు. అనంతరం 13 మంది జాలర్లను విడుదల చేయాలని సీఎం స్టాలిన్ భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశాలు. ఈ క్రమంలో 13 మంది జాలర్లను శ్రీలంక కోర్టు విడుదల చేసింది. దీంతో వారిని శ్రీలంకలో ఉన్న భారత దౌత్యాధికారులకు అప్పగించారు. అయితే 13 మంది జాలర్లకు పాస్‌పోర్టులు లేకపోవడం వల్ల భారత దౌత్యాధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్, విమాన టిక్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో బుధవారం అర్థరాత్రి శ్రీలంక నుంచి విమానంలో 13 మంది జాలర్లు చైన్నెకి వచ్చారు. చైన్నె విమానాశ్రయానికి చేరుకున్న 13 మంది తమిళ జాలర్లను రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లంక సేనల తుపాకీ కాల్పుల్లో గాయపడిన సెంతమిళ్‌ను అంబులెన్స్ ద్వారా చైన్నెలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు. 12 మంది జాలర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ద్వారా సొంత ఊర్లకు పంపించారు. కాగా గురువారం తెల్లవారుజామున రెండు నాటు పడవల్లో చేపల వేటకు వెళ్లిన పదిమంది జాలర్లను శ్రీలంక దళాలు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.


