సాక్షి, చైన్నె: అధునాతన అపెండిక్స్ క్యాన్సర్ కోసం హెచ్‌ఐపీఈసీతో సంక్లిష్ట కణ పునరుత్పత్తి ( సైటోరెడక్టివ్) శస్త్ర చికిత్సను పూందమల్లిలోని బీవెల్ ఆస్పత్రి వైద్యులు విజయవంతం చేశారు. పది గంటల పాటూ ఈ శస్త్ర చికిత్స జరిగింది. బుధవారం ఈ వివరాలను బీ వెల్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శబరీసన్ మీడియాకు వివరించారు.ప్రమీల దయాలు (47 ) మహిళకు ఎదురైన ఆరోగ్య సమస్యలకు జరిగిన వైద్య పరిశోధనలతో వ్యాధి వ్యాప్తి పరిధి కారణంగా ఈ కేసు సవాలుగా మారిందన్నారు. ఇందుకు సమన్వయంతో కూడిన శస్త్రచికిత్సా విధానం, తాజా హెచ్‌ఐపీఈసీ సాంకేతికతతో సైటో రిడక్షన్‌ను సాధించామన్నారు. ఇది అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణను అందించే చికిత్స అని వివరించారు. బీ వెల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ సిజె వెట్రివెల్ మాట్లాడుతూ, 12 ప్రదేశాలలో సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేయడానికి తాము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నామన్నారు. అధునాతన వైద్య సేవలను అందిస్తున్నామని పేర్కొంటూ తాజా శస్త్ర చికిత్స పది గంటల పాటుగా జరిగిందన్నారు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో కుడి హెమికోలెక్టమీ, మిడ్ ఇలియల్ రిసెక్షన్ , సుప్రాకోలిక్ కంప్లీట్ ఒమెంటెక్టమీ, టోటల్ అబ్డామినల్ హిస్టెరెక్టమీ, బైలేటరల్ సాల్పింగో–ఓఫోరెక్టమీ, పెల్విక్ పెరిటోనెక్టమీ, టోటల్ ప్యారిటల్ పెరిటోనెక్టమీ, పెల్విక్ నోడల్ డిసెక్షన్, ఇలియోస్టమీ ఉన్నాయన్నారు. డాక్టర్లు శబరీసన్, అజయ్ కుమార్, ముహమ్మద్ ఒవైసీ, గుణ శేఖర్, సుధాకర్, ప్రవీణ్ కుమార్, విమల, క్రిస్ నిశాంత్ వంటి నిపుణులైన సర్జన్ల బృందంతో పాటూ అనస్తీషియా డాక్టర్ దేవేంద్రకుమార్ నేతృత్వంలో నర్సింగ్ బృందం వినోద్ కుమార్, జయంతి, జయశ్రీ, మోహన్ రాజ్, మహిమై దాస్, సత్యరాజ్, మణికండన్ వైద్య సేవలు అందించారని తెలిపారు.


