కేరళ సంప్రదాయనృత్య ప్రదర్శన
సాక్షి, చైన్నె : వేసవి సెలవులలో దేశీయ పర్యటకులను ఆకర్షించేందుకు కేరళ టూరిజం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం స్థానికంగా వేసవి పర్యాటక ఆహ్వాన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తర కేరళ, బెకల్, వాయనార్, కన్నూర్, కోలీకోడ్‌తో పాటూ పర్యాటక ప్రాంతాలన్నీ పర్యాటక ఆకర్షణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ‘కేరళ పర్యాటక రంగాన్ని ఒక ఉత్తేజకరమైన సంస్థగా మార్చడంలో భాగంగా, బలోపేతం దిశగా పాన్ ఇండియా ప్రచారాలకు చైన్నె నుంచి శ్రీకారం చుట్టినట్టు కేరళ పర్యాటక మంత్రి మహ్మద్ రియాజ్ తెలిపారు. కేరళ పర్యాటక డైరెక్టర్ సురేంద్రన్ మాట్లాడుతూ, శాశ్వత ఆకర్షణను నిలుపుకోవడమే కాకుండా, వినూత్న ఉత్పత్తులు, అభివృద్ధిపై దృష్టి పెడుతూ, అన్ని సీజన్లలో పర్యాటకులు తరలి వచ్చేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కేరళ పర్యాటక రంగంలో దేశీయ సందర్శకులు గణనీయమైన వాటాను కలిగి ఉన్నందున,పాఠశాలలకు వేసవి సెలవుల్లో పర్యాటక సంఖ్య పెరుగుదలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న వాటాదారులతో భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. అంతర్జాతీయ పారాగ్లైడింగ్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టామన్నారు. ఈనెల 23 వరకు ఇడిక్కిలో ఈ వేడుక జరుగుతుందన్నారు. మార్చి 28 నుంచి 30 వరకు వయనాడ్‌లోని మనంతవాడిలో మౌంటెన్ బైకింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయన్నారు. ప్రయాణ ప్రియులకు హౌస్‌బోట్లు, కారవాన్ బసలు, తోటల సందర్శనలు, అడవి రిసార్ట్‌లు, హోమ్‌స్టేలు, ఆయుర్వేద ఆధారిత వెల్‌నెస్ సొల్యూషన్స్, సాహస కార్యకలాపాలు, గ్రామీణ నడకలు, పచ్చని కొండలకు ట్రెక్కింగ్ వంటి విభిన్న అనుభవాలను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కేరళ సంప్రదాయ సంగీత, నాట్య ప్రదర్శనలు మిన్నంటనున్నాయన్నారు.
వేసవి పర్యాటక ప్రచారానికి కేరళ శ్రీకారం


