తిరువళ్లూరు: పుస్తక పఠనం పెరిగితే జీవితం గాడినపడినట్టేనని సినీనిర్మాత మారిసెల్వరాజ్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన పది రోజుల పాటు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన కార్యక్రమానికి సినీనిర్మాత మారిసెల్వరాజ్, సినీగాయని సెంథిల్‌గణేష్ రాజ్యలక్ష్మి హాజరయ్యారు. మొదట సెంథిల్ గణేష్, రాజ్యలక్ష్మి బృందం నిర్వహించిన కచ్చేరి అందరినీ ఆకట్టుకుంది. పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలు, గ్రామీణ కళలు, సంప్రదాయాలపై పాడిన ప్రత్యేక పాటలు అలరించాయి. అనంతరం మారి సెల్వరాజ్ మాట్లాడుతూ పుస్తక అభ్యసనం ప్రతి జీవితంలోనూ మార్పులు తెస్తుందన్నారు. పుస్తక పఠనాన్ని ప్రాథమిక దశ నుంచే అలవరుచుకోవాలన్న ఆయన, యువత విద్యార్థులు పుస్తకాలతో స్నేహం చేయాలని పిలుపునిచ్చారు. పుస్తకాలను చదవడం ద్వారా తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవడంతో పాటు చెడు అలవాట్లకు సైతం దూరంగా వుండొచ్చన్నారు. విద్యార్థులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


