సాక్షి, చైన్నె: చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ నేతృత్వంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చైన్నెలో ఆదివారం ర్యాలీ జరిగింది. మాజీ డీజీపీ డాక్టర్ శైలేంద్ర బాబు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఏ అరుణ్, ఆదేశాలతో చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు, సెంట్రల్ క్రైమ్‌బ్రాంచ్ , శ్రీ రామచంద్ర ఉన్నత విద్య సంస్థ, సైబర్ క్రైమ్ యూనిట్, పరిశోధనా సంస్థతో పాటూ కళాశాల విద్యార్థులతో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, వివాహాల పేరిట ఆన్‌లైన్ మోసాలు, ఆనన్‌లైన్ పార్ట్–టైమ్ ఉద్యోగాల పేరిట మోసాలు సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్లకార్డులను చేత బట్టి అవగాహన ర్యాలీ నిర్వహించారు. బెసెంట్‌నగర్‌లోని ఎలియట్స్ బీచ్ పోలీస్ సహాయ కేంద్రం నుంచి పలు ప్రాంతాల గుండా ర్యాలీ జరిగింది. మాజీ డీజీపీ శైలేంద్ర బాబు, విద్యార్థులతో కలిసి రంగురంగుల బెలూన్‌లను ఎగుర వేశారు. ఈ ర్యాలీలో సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930ని ప్రదర్శించారు. సైబర్ నేరాల అవగాహన గురించి మరింత సమాచారంలో రాణించిన శ్రీరామచంద్ర ఉన్నత విద్య, పరిశోధనా సంస్థకు చెందిన 10 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అదనపు కమిషనర్ ఎ. రాధిక, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ (సౌత్) బండి గంగాధర్, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్లు, ఎస్. ఆరోగ్య, వి.వి. గీతాంజలి. జి. వనిత, పోలీస్ అధికారు లు, ప్రజలు పాల్గొన్నారు. సైబర్ నేరాల మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండడం, తక్షణ సహాయం కోసం 1930ను సంప్రదించడం, సైబ ర్ నేరాలను నిరోధించడం, నివారణ, వేగవంతమైన చర్యను నిర్ధారించడం, ఫిర్యాదులు చేయాల్సిన www.cybercrime.gov.in వెబ్ సైట్ గురించి ఈ ర్యాలీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.


