తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆస్తి, తాగునీరు, ఇంటి పన్నులను వందశాతం వసూలు చేయాలని కలెక్టర్ ప్రతాప్ సిబ్బందిని ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పన్నులు వసూలు చేయడానికి శని, ఆదివారం రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. రెండవ రోజైన ఆదివారం పేరంబాక్కంలో జరిగిన శిబిరాన్ని కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పన్నులను వందశాతం వసూలు చేయాలన్నారు. అక్రమాలను నిరోధించడానికి డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు కూడా వ్యాఖ్యానించారు. పన్నుల చెల్లింపుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


