కోలాహలం.. ఆణికులతమ్మ రథోత్సవం
వేలూరు: వేలూరు వేలపాడిలోని గ్రామ దేవతైన శ్రీ ఆణికులతమ్మ అమ్మవారి రథోత్సవం ఆదివారం ఉదయం కోలాహలంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు అములు, డాక్టర్ అయ్యప్పన్, వేణు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల సమయంలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని రఽథంలో ఆశీనులు చేసి దీపారాధన పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణాల మధ్య రథాన్ని లాగారు. ఈ రథం వేలపాడిలోని పలు వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వడంతో ప్రతి ఇంటి ముందు మహిళలు బొరుగులు, ఉప్పు, మిర్యాలు, పూలు చల్లడంతో పాటు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎండ వేడిమిని కూడా పట్టించుకోకుండా రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు దాతలు, పారిశ్రామిక వేత్తలు వీధుల్లో మజ్జిగ, తాగునీటిని సరఫరా చేయడంతో పాటు భక్తులకు అన్నదానం చేశారు. ఈ రథోత్సవం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి సన్నధికి చేరుకుంది.


