పళ్లిపట్టు: తమిళనాడు– ఆంధ్ర రాష్ట్రాలకు సరిహద్దులోని గ్రామంలో కోళాత్తమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం కోలాహలంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వివరాలు..పళ్లిపట్టు సమీపం ఆంధ్ర సరిహద్దులోని తమిళనాడు గ్రామం కుమారమంగళం. ఈగ్రామంలో శ్రీ కోళాత్తమ్మన్‌కు పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన ఆలయం నిర్మించాలని గ్రామీణులు నిర్ణయించారు. ఇందుకోసం నూతన ఆలయ నిర్మాణ పనులు మూడేళ్ల క్రితం ప్రారంభించారు. కోళత్తమ్మన్ ఆలయ విమాన గోపురం సన్నిధి, వినాయకుడి సన్నిధి, నాగాలమ్మన్ సన్నిధి, నవగ్రహ సన్నిధి సహా రాతి మండపం, నిర్మాణపు పనులు పూర్తి చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటూ మహాకుంభాభిషేకం సందర్భంగా గ్రామ వీధులు, ఆలయం విద్యుద్దీపాలతో సర్వాంసుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి నిత్య హామగుండ పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి, గోపూజ అనంతరం తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కుంభాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేళతాళాల నడుమ కలచాలు బయల్దేరి విమాన గోపురానికి పవిత్ర తీర్ధాలతో మహాకుంభాభిషేకం దీపారాధన చేశారు. అనంతరం అమ్మవారికి అభిషేక పూజలతో దీపారాధన చేపట్టి భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తులందరికీ అన్నదానం పంపిణీ చేశారు. రాత్రి అమ్మవారు బాణసంచా వేడుకల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగారు.
ఘనంగా కోళాత్తమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం


