సాక్షి, చైన్నె: తక్షణం బిడ్దలను కనండి.. తమిళ పేర్లు పెట్టండి అని నవ వధూవరులకు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పిలుపు నిచ్చారు. చైన్నె కలైవానర్ అరంగంలో సీఎం ఎంకే స్టాలిన్ 72వ బర్త్‌డే వేడుకలలో భాగంగా 72 జంటలకు వివాహ వేడుక బుధవారం జరిగింది. అత్యంత వేడుకగా జరిగిన ఈ వివాహంలో నవ దంపతులకు 50 రకాల సారెలను అందజేశారు. వధువరులకు తాళి బొట్లను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి శేఖర్‌బాబు పూర్తి సమయం రాజకీయ నేత అని కితాబు ఇచ్చారు. అన్ని చోట్ల ఆయనే ఉంటారని, అందరికి సింహస్వప్నంగా మారి ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మూడేళ్లలో ఆయన నేతృత్వంలో 1700 వివాహాలు జరిగి ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇందులో అనేక కులాంతర, ప్రేమ వివాహాలు ఉన్నాయని వివరించారు. తనది కూడా ప్రేమ వివాహమేనని గుర్తు చేస్తూ, తన కుటుంబంలో అనేక ప్రేమ వివాహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రేమకు తమ కుటుంబ పెద్దలు వ్యతిరేకులు కాదు అని స్పష్టం చేశారు. పెద్దలు కుదిర్చిన వివాహం తక్కువేనని, రెండు తరాలలో ప్రేమ వివాహాలే ఎక్కువ అని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న దంపతులు తక్షనం బిడ్దలను కనాలని, ఎక్కవ మందిని కనాలని, వారందరికి తమిళ పేర్లు పెట్టాలని పిలుపు నిచ్చారు. కుటుంబ నియంత్రణను విజయవంతం చేసినందుకు గాను తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శిక్ష విధించే పనిలో పడిందని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించేందుకు సిద్ధమయ్యారని, వీరి కుట్రలకు చెక్‌పెట్టడం లక్ష్యంగా ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్ దూకుడు పెంచి ఉన్నారన్నారు. ఇందుకు అందరం అండగా నిలబడుదామంటూ, ఆలస్యం చేయకుండా నవదంపతులు బిడ్డలను కనాలని మరో మారు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో మంత్రులు శేఖర్‌బాబు, ఎం సుబ్రమణియన్ , మేయర్ ప్రియ తదితరులు పాల్గొన్నారు.


