ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం

Published Mon, May 27 2024 6:20 PM

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం

●కౌంటింగ్‌ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు

వేలూరు: పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండడంతో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల్లో టెన్షన్‌ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేస్తోంది. ఆదివారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి వేలూరు తందై పెరియార్‌ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎం మిషన్‌లు భద్ర పరిచి సీల్‌ వేసిన గదిని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. అదే విధంగా కౌంటింగ్‌కు వచ్చే అధికారులు, ఏజెంట్‌లు, అభ్యర్థులు లోనికి వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రంతోపాటు ఈవీఎం మిషన్‌లు ఉంచిన గదిని ప్రతి రోజూ సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలించేందుకు 24 గంటలపాటు పోలీసులను ఉంచామన్నారు. వేలూరు పార్లమెంట్‌ స్థానంలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 84 బెంచ్‌లు ఉంచామని, 16 నుంచి 22 రౌండ్లు కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని బెంచ్‌లకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఏజెంట్‌లు చూసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు కేంద్రంలో ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద విద్యుత్‌ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు తదితర అన్ని వసతులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో పాటు మీడియా సెంటర్‌ను ప్రత్యేకంగా ఉందన్నారు. అదే విధంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 600 మందితో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధులు లోనికి రాకుండా రోడ్డుపైనే నిలిపి వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించబోమన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement