
విలేకరులతో మాట్లాడుతున్న డైరెక్టర్ మ్యాథ్యూ
వేలూరు: వేలూరు క్రిష్టియన్ మెడికల్ కళాశాల(సీఎంసీ) ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో నిరుపేదలకు రూ.309 కోట్ల వరకు ఉచితంగా వైద్య సేవలు అందజేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ విక్రమ్ మ్యాథ్యూ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలూరు సీఎంసీ ఆస్పత్రి గత 123 సంవత్సరాలుగా ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు అందజేస్తోందన్నారు. కరోనా కాలంలో 1,500 మంది ప్రాణాలను ఒకేసారి కాపాడగలిగామన్నారు. వేలూరు, రాణిపేట జిల్లాల్లోని రెండు ఆస్పత్రుల్లోనూ ప్రధాన మంత్రి ఆయుష్‌మాన్ పథకంతో పాటు ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందజేయనున్నట్లు తెలిపారు. మనల్ని కాపాడే 48 పథకం కింద 1,200 మందికి చికిత్స అందజేశామని, ప్రమాదాల్లో చిక్కుకున్న 700 మందికి చికిత్స అందించామని తెలిపారు. ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటు వస్తోందని ఇందుకు కారణం ఫాస్ట్‌పుడ్ ఆహారాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా వస్తుందన్నారు. కరోనా కాలం అనంతరం కొంత మంది వ్యాక్సిన్ వేసుకున్నందువల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని అపోహలున్నాయని అది నిజాలు కాదన్నారు. సీఎంసి ఆస్పత్రి ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో తరచూ రెండు, మూడవ స్థానంలో వస్తుందని వీటిని మొదటి స్థానంలో తీసుకొచ్చేందుకు పలు పరిశోధనలు చేస్తున్నామన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ రాజేష్, పీఆర్‌ఓ దురై జాస్పర్ పాల్గొన్నారు.
–సీఎంసీ ఆస్పత్రి డైరెక్టర్ విక్రమ్ మ్యాథ్యూ