సీఎండీఏ నేతృత్వంలో బ్రహ్మాండ నిర్మాణాలు

పుదుకోటైలో ప్రభుత్వ దంత వైద్యకళాశాలను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్‌  - Sakshi

సాక్షి, చైన్నె: రాజధాని నగరంలో చైన్నె మెట్రో డెవలప్‌ మెంట్‌ అథారిటీ (సీఎండీఏ) నేతృత్వంలో బ్రహ్మాండ నిర్మాణాలు మరిన్ని రూపుదిద్దుకోనున్నాయి. రూ.150 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు బుధవారం సీఎం స్టాలిన్‌ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భూమిపూజ చేశారు. చైన్నె నగరం విస్తరిస్తున్న విషయం తెలిసిందే. సీఎండీఏ పరిధిలో ఓ వైపు చెంగల్పట్టు వరకు మరో వైపు అరక్కోణం, ఇంకోవైపు తిరువళ్లూరు జిల్లాను కలుపుతూ సరిహద్దులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే సీఎండీఏ నేతృత్వంలో చైన్నెలో ఎన్నో నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం మరిన్ని నిర్మాణాల దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రూ.97 కోట్లతో చెంగల్పట్టు జిల్లా వెంబాక్కంలో కొత్త బస్టాండ్‌, చైన్నె శివారులోని అంబత్తూరులో రూ.13.85 కోట్లతో బస్టాండ్‌ ఆధునికీకరణ, హోదా పెంపు, రూ.11.50 కోట్లతో కొండితోపులో దివ్యాంగుల పునరావస కేంద్రం నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే, కోయంబేడు, మైలాపూర్‌లలో సహజ అడవులను తలపించే విధంగా పార్కుల ఏర్పాటుకు రూ.10.30 కోట్లు కేటాయించారు. చైన్నె కార్పొరేషన్‌ పరిధిలోని ముండకన్నియమ్మన్‌ ఆలయం సమీపంలో రూ.8.75 కోట్లతో ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు, కాశిమేడు బీచ్‌ను రూ.8.65 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దడం తదితర పనులకు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.

పుదుకోట్టైలో దంత వైద్యకళాశాల..

పుదుకోట్టైలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో రెండవ అతిపెద్ద దంతై వైద్యకళాశాల, ఆస్పత్రి రూపదిద్దుకుంది. రూ.67.83 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. అందరికీ ఆరోగ్య పథకాల పేరిట ఆరోగ్యశాఖ నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా పుదుకోట్టై జిల్లాలో చారిత్రాత్మక ఘట్టంగా బ్రహ్మాండ దంత వైద్య కళాశాల, ఆస్పత్రిని రూ.67 కోట్ల 83 లక్షలతో నిర్మించారు. 2023–24 సంవత్సరంలో ఇక్కడ 50 సీట్లను భర్తీ చేసే విధంగా అనుమతులు ప్రభుత్వం పొందింది. 10.14 ఎకరాలలో నిర్మించిన కళాశాల, ఆస్పత్రి, హాస్టళ్ల భవనాలను, అత్యాధునిక వైద్య పరికరాలను సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అలాగే, పుదుకోట్టై జిల్లాలో రూ. 8.89 కోట్లతో ఆరోగ్యశాఖ కోసం నిర్మించిన కార్యాలయాలు, ఆరోగ్య కేంద్రాల భవనాలను కూడా సీఎం ప్రారంభించారు.

రావుబహుదూర్‌ విగ్రహం ఆవిష్కరణ..

తూత్తుకుడి నగర పితామహుడిగా రావు బహుదూర్‌క్రూజ్‌ ఫెర్నాండెజ్‌కు మున్సిపల్‌ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రూ.77 లక్షల 87 వేలతో ప్రతిష్టించిన విగ్రహం, గోపురం తరహా నిర్మాణాలను సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బహుదూర్‌ క్రూజ్‌ ఫెర్నాండెజ్‌కు గౌరవాన్ని కల్పించే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. మంత్రులు అన్బరసన్‌, శేఖర్‌బాబు, ఎం సుబ్రమణియన్‌, రఘుపతి, శివ మెయ్యనాథన్‌, స్వామినాథన్‌ గీతాజీవన్‌, అనితా ఆర్‌ రాధాకృష్ణన్‌, ఎంపీ కనిమొళి, కె నవాజ్‌ఖని, సీఎస్‌ శివదాస్‌ మీనా, తమిళాభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్‌ సెల్వరాజ్‌, న్యూస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ టి మోహన్‌ పాల్గొన్నారు.

రూ. 150 కోట్లతో పనులు

సీఎం స్టాలిన్‌ శంకుస్థాపన

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top