క్రికెటర్ల సందడి | Sakshi
Sakshi News home page

క్రికెటర్ల సందడి

Published Thu, Oct 5 2023 2:06 AM

విమానాశ్రయం నుంచి వస్తున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ  - Sakshi

● చైన్నెకు చేరుకున్న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ● విమానాశ్రయంలో అభిమానుల ఘన స్వాగతం ● చేపాక్కంలో ప్రాక్టీస్‌

సాక్షి, చైన్నె: ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొనేందుకు భారత క్రికెట్‌ జట్టు, ఆస్ట్రేలియా జట్టు బుధవారం చైన్నెకు చేరుకున్నాయి. విమానాశ్రయంలో తమ క్రికెట్‌ హీరోలకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. గట్టి భద్రత నడుమ ప్రత్యేక బస్సుల్లో హోటల్‌కు క్రికెటర్లు వెళ్లారు. గురు, శుక్ర, శనివారాల్లో ఇరు జట్లు వేర్వేరుగా చేపాక్కం స్టేడియంలో సాధన చేయనున్నాయి. వివరాలు.. తమిళనాట క్రికెట్‌ అభిమానం మరీ ఎక్కువే అన్న విషయం తెలిసిందే. చైన్నె చేపాక్కంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌లు అంటే చాలు టికెట్ల కోసం అభిమానులు ఎగబడడం జరుగుతుంది. అయితే వన్డే మ్యాచ్‌లు అయినా, టీ 20 అయినా, ఐపీఎల్‌ అయినా, టెస్టు మ్యాచ్‌లు అయినా సరే పరుగులు తీస్తుంటారు. ఆ దిశగా ప్రస్తుతం 50 ఓవర్ల ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో భాగంగా ఈనెల 8వ తేదీన భారత్‌ జట్టు తొలి మ్యాచ్‌ చేపాక్కంలో జరగనుంది. ఇక్కడ ఐదు మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ భారత్‌ జట్టు ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడుతుండడం అభిమానులకు కాస్త నిరాశే. ఈనెల 8న భారత్‌ – ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఆ తర్వాత 13వ తేదీన న్యూజిలాండ్‌ – బంగ్లాదేశ్‌, 18వ తేదీన న్యూజిలాండ్‌ – ఆఫ్గానిస్తాన్‌, 23న పాకిస్తాన్‌ – ఆప్గానిస్తాన్‌, 27వ తేదీన పాకిస్తాన్‌ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య చైన్నె వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్తాన్‌, ఆఫ్గానిస్తాన్‌ జట్ల మ్యాచ్‌లు చైన్నెలో అధికంగా జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈనెల 8వ తేదీన జరిగే మ్యాచ్‌ నిమిత్తం భారత జట్టు సభ్యులు బుధవారం ఉదయం చైన్నెకు చేరుకున్నారు.

ఘన స్వాగతం

రోహిత్‌ శర్మ నేతృత్వంలో భారత జట్టులోని 15 మంది సభ్యులు ఉదయం చైన్నె విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి చైన్నె అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సులో క్రికెటర్లు అందర్నీ హోటల్‌కు తరలించారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జడేజా కేఎస్‌ రాహుల్‌, అశ్విన్‌ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే, వారిని చూసిన ఆనందంలో అభిమానులు కేరింతలు కొడుతూ నినాదాలు చేస్తూ ఆహ్వానించారు. అలాగే కమిన్స్‌ నేతృత్వంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు చైన్నెకు చేరుకున్నారు. వీరిని ఆహ్వానించిన అధికారులు ప్రత్యేక బస్సులో భద్రత నడుమ హోటల్‌కు పంపించారు. గురు, శుక్ర, శనివారాల్లో చేపాక్కం స్టేడియంలో ఉదయం సాయంత్రం వేళలలో ఇరు జట్లు వేర్వేరుగా సాధన చేయనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. క్రికెటర్లు హోటల్‌ నుంచి చేపాక్కంకు వెళ్లే మార్గాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. క్రికెటర్ల బస్సుల ముందు, వెనుక భాగంలో పలు పోలీసు ఎస్కార్ట్‌ వాహనాలు దూసుకెళ్లడం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement