అరెస్టయిన వృద్ధుడు
● చైన్నెకు చెందిన వృద్ధుడు అరెస్ట్
తిరువళ్లూరు: మూడు కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించిన వృద్ధుడిని పోలీసులు 23 సంవత్సరాల తరువాత అరెస్టు చేశారు. చైన్నె ఆట్రంతాంగెల్ ప్రాంతానికి చెందిన నటరాజన్ కుమారుడు వెంకటేషన్. ఇతడికి తిరువళ్లూరు జిల్లా పొన్నేరి పాడియనల్లూరు ప్రాంతంలో 78 సెంట్ల భూమి వుంది. ఈ భూమికి తామే వారసులమని చైన్నెకు చెందిన రామయ్య నకిలీ పత్రాలను సృష్టించారు. అనంతరం నటరాజన్‌కు వారసులుగా అదే గ్రామానికి చెందిన రఘుపతి అనే వ్యక్తిని చూపించి 2000వ సంవత్సరంలో విక్రయించాడు. ఈ సంఘటనపై బాధితులు అప్పట్లో చైన్నె కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే ఇంత వరకు నిందితులను అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆవడి కమిషనర్ శంకర్ నేతృత్వంలో జరిగిన గ్రీవెన్స్‌డేకు హాజరై 23 సంవత్సరాలుగా మూలనపడ్డ తన కేసుపై ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కమిషనర్ డిప్యూటీ కమిషనర్ పెరుమాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేశారు. విచారణలో తిరువీకేనగర్‌కు చెందిన వెంకయ్య కుమారుడు రామయ్య(73) పొన్నేరిలోని వెంకటేషన్‌కు చెందిన భూములకు నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు నకిలీ వ్యక్తులను వారసులుగా చూపించి విక్రయించినట్టు గుర్తించారు. అనంతరం కేసులో ప్రధాన నిందితుడిగా వుంటూ పరారీలో ఉన్న రామయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


