సైకిల్ యాత్రలో సంజీవి
● ట్విట్టర్ నిర్ణయం ● ఆ పార్టీ నాయకులందరికీ కూడా
సాక్షి, చైన్నె: నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకుల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. అలాగే, మరికొందరు తమిళాభిమాన సంఘాల ప్రతినిధుల ఖాతాను సస్పెండ్ చేశారు. నామ్ తమిళర్ కట్చి నేతగా, సినీ నటుడు, దర్శకుడిగా సీమాన్ అందరికి సుపరిచితుడే. అయితే, సీమాన్ చేసే వ్యాఖ్యలు, చేసే విమర్శలు, ఆరోపణలు తరచూ వివాదాలకు దారి తీయడం జరుగుతుంటాయి. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అనేక సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, తన అభిప్రాయాలు, గళాన్ని వినిపిస్తూ వచ్చారు. ఈ పరిస్థితులలో గురువారం సీమాన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యుల ట్విట్టర్ ఖాతాలన్నీ బ్లాక్ అయ్యాయి. అలాగే, మే 17 ఇయక్కం తిరుమురుగన్‌గాంధితో పాటు పలు తమిళాభిమాన సంఘాల నేతల ట్వీట్ ఖాతాలు సస్పెండ్ అయ్యాయి. సమాచారంతో ఆ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేయడాన్ని ఖండించారు. సంబంధిత సంస్థకు ఫిర్యాదులు చేశారు. అయితే, తమకు చట్టపరంగా వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తుల మేరకు వీరి ఖాతాలను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. ఈ చర్యలను సీఎం స్టాలిన్ ఖండించారు. తమ అభిప్రాయాలను చెప్పుకొంటూ వస్తున్న వారి గళాన్ని, గొంతునులిమే విధంగా ట్విట్టర్ పని తీరు ఉందని మండిపడ్డారు. త్వరితగతిన వారి ఖాతాను పునరుద్ధరించాలని కోరారు.
పోరుబాటకు రెడీ!
– పళనిస్వామి
సాక్షి, చైన్నె: కావేరి తీరంలోని మేఘదాతులో డ్యాం నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరుబాటకు తాము సిద్ధమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తెలిపారు. కర్ణాటక చర్యలను ఆదిలోనే అడ్డుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం శివకుమార్ మేఘదాతులో డ్యాం నిర్మించి తీరుతామని బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి గురువారం స్పందించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కర్ణాటక పాలకుల చర్యలు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ, డ్యాం నిర్మాణ జోలికి వెళ్లకుండా పకడ్బందీ చర్యలతో ముందుకెళ్లామన్నారు. అయితే ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా డెల్టా రైతులు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్నారు. మేఘదాతులో డ్యాం నిర్మాణాలకు కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని, లేనిపక్షంలో కొత్త సమస్యలు తప్పవని డీఎంకే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డ్యాం పనులకు వ్యతిరేకంగా పోరాటాలకు అన్నాడీఎంకే సిద్ధం అని ప్రకటించారు. డెల్టా రైతు సంక్షేమమే తమకు ముఖ్యమని స్పష్టంచేశారు. కాగా, శివకుమార్ వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ స్పందిస్తూ, మేఘదాతు వ్యవహారంలో కర్ణాటక తన ధోరణి మార్చుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా లౌకికవాద శక్తులన్నీ ఏకం అవుతున్న సమయంలో డ్యాం అంశంతో శివకుమార్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా మున్ముందు సమస్యలు తప్పవన్న విషయాన్ని గుర్తించి, ఇకనైనా ఆ ప్రస్తావన పక్కన పెట్టాలని సూచించారు.
నదుల అనుసంధానం కోసం సైకిల్‌యాత్ర
తిరుత్తణి: నదుల అనుసంధానం కోసం హోటల్ కార్మికుడు దేశవ్యాప్తంగా సైకిల్ యాత్రకు గురువారం శ్రీకారం చుట్టారు. అమ్మయార్‌కుప్పంకు చెందిన సంజీవి(55) హోటల్ కార్మికుడు. డీఎంకే సభ్యుడు. పార్టీ సిద్ధాంతాలను సైకిల్ ద్వారా ప్రచారం చేసి గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కరుణానిధి శత జయంతి ఉత్సవాలు పురష్కరించుకుని దేశ వ్యాప్తంగా సైకిల్‌యాత్రను అమ్మయార్‌కుప్పం నుంచి ప్రారంభించారు. ఇందులో మండల డీఎంకే కార్యదర్శి షణ్ముగం, సర్పంచ్ ఆనంది పాల్గొని సైకిల్ యాత్రను ప్రారంభించారు. సంజీవి మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా సైకిల్ ప్రచారం చేస్తున్నానని డీఎంకే సిద్ధాంతాలు నమ్మి ప్రతి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌లో వెళ్లి ప్రచారం చేశానన్నారు. జాతి ఐక్యతా భావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు 2007లో సైకిల్ ప్రచారం చేపట్టానని చెప్పారు. నదుల అనుసంధానం కోసం చేపట్టిన ప్రచారం దేశ వ్యాప్తంగా ఐదు నెలల తిరిగి ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు.
సీమాన్


