సీక్వెల్‌కు సిద్ధమవుతున్న జీవా | - | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌కు సిద్ధమవుతున్న జీవా

Apr 29 2023 12:16 AM | Updated on Apr 29 2023 6:39 AM

- - Sakshi

నటుడు జీవా తాను ఇంతకుముందు నటించిన సూపర్‌హిట్‌ చిత్ర సీక్వెల్‌కు సిద్ధమవుతున్నారు అనేది తాజా సమాచారం. ఈయన 2009లో కథానాయకుడిగా నటించిన చిత్రం శివ మనసుల శక్తి. రాజేష్‌ ఎం దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ప్రేమ, వినోదం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం యువతకు విపరీతంగా నచ్చేసింది.

కాగా ఇటీవల నటుడు జీవాకు సరైన హిట్‌ పడలేదనే చెప్పాలి. దీంతో మళ్లీ శివ మనుషుల శక్తి చిత్రానికి సీక్వెల్‌ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. జీవా ప్రస్తుతం గీత రచయిత పా.రంజిత్‌ దర్శకత్వంలో చారిత్రక కథా చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా దర్శకుడు రాజేష్‌ ప్రస్తుతం జయం రవి కథానాయకుడుగా చిత్రాన్ని చేస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత రాజేష్‌ నటుడు జీవా కథానాయకుడుగా శివ మనసుల శక్తి చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా దీనికి నటుడు జీవా నిర్మాతగా వ్యవహరించనున్నారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌బీ.చౌదరి ఈయన తండ్రి అన్నది తెలిసిందే. తాజాగా నటుడు జీవా కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement