తమిళంలో పరీక్షకు.. అనుమతి ఇవ్వండి | Sakshi
Sakshi News home page

తమిళంలో పరీక్షకు.. అనుమతి ఇవ్వండి

Published Mon, Apr 10 2023 11:58 AM

- - Sakshi

సాక్షి, చైన్నె:సీఆర్‌పీఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలను తమిళంలో రాసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ రాశారు. ఇందులో రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌ పేర్కొన్న అంశాల మేరకు తమిళంతో పాటుగా పలు ప్రాంతీయ భాషలు అధికారిక భాషలుగా గుర్తించినట్టు వివరించారు. అయితే అయితే రిక్రూట్‌మెంట్‌ కోసం జరిగే కంప్యూటరైజ్డ్‌ టెస్ట్‌ ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే నిర్వహించడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, త మిళనాడులోని యువకులకు అవకాశం దక్కనివ్వకుండా చేస్తుండడం షాక్‌కు గురి చేసిందన్నారు. మొత్తం 9,212 పోస్టుల్లో తమిళనాడులో 579 పోస్టులు ఉన్నట్లు వివరించారు.

12 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరీక్షలను మాతృభాషల్లో రాయడానికి అవకాశం కల్పించాలని కోరారు. హిందీ మాట్లాడే వారికి అవకాశం కల్పించే విధంగా, అనుకూల వాతావరణం సృష్టించే రీతిలో పరీక్షల నిర్వహించడం తగదన్నారు. తమిళనాడులోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ నోటిఫికేషన్‌, దరఖాస్తులు తమ రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా, ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. వివక్ష అనేది చూపించకుండా అందరికీ అవకాశం కల్పించే విధంగా, నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలని కోరారు. ఆయా రాష్ట్రాల యువత వారి వారి మాతృ భాషల్లో పరీక్షలు రాసేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

పీఎంకు వినతిపత్రం  అందజేత..
చైన్నె పర్యటనకు శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం స్టాలిన్‌ ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందులో పేర్కొన్న సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం ప్రకటన రూపంలో ఆదివారం తెలియజేసింది. చైన్నె విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విజ్ఞప్తిని అందజేసినట్టు అధికారులు ఇందులో గుర్తు చేశారు. చైన్నె మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి విమానాశ్రయాల విస్తరణ పనులు, పరందూరు కొత్త విమానాశ్రయం పనులపై త్వరితగతిన దృష్టి పెట్టాలని కోరినట్లు వెల్లడించారు.

పాదరక్షల తయారీకి కొత్త ఉత్పాదక ప్రోత్సాహకాలు, యువజన సంక్షేమం, క్రీడల శాఖ తరపున తమిళనాడులో స్పోర్ట్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా జోన్‌ ఏర్పాటు, రామేశ్వరం నుంచి ధనుస్కోటి వరకు కొత్త బ్రాడ్‌ గేజ్‌ మార్గం పనులు, కచ్చదీవుల స్వాధీనం, తమిళ జాలర్లపై జరుగుతున్న దాడులకు అడ్టకట్ట వేయడం తదితర అంశాలను ఆ వినతిపత్రంలో వివరంగా తెలియజేశామన్నారు.

Advertisement
 
Advertisement