పదింతల ఫీజు బాదుడు | - | Sakshi
Sakshi News home page

పదింతల ఫీజు బాదుడు

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

అదనంగా వసూలు చేయొద్దు

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

సూర్యాపేటటౌన్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలంటేనే విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడుతుండటం తల్లిదండ్రులకు భారంగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు నిర్ణయించిన రుసుం మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ ఖర్చులు, ఇతర కారణాలు చూపుతూ విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వందల్లో రుసుం ఉంటే..

పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్ష రాసేందుకు ఈ నెల 16వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒక్కో విద్యార్థికి పరీక్ష ఫీజు కేవలం రూ.125 మాత్రమే నిర్ణయించగా గడువు దాటిన తర్వాత రూ.50 నుంచి రూ.200 వరకు అదనపు రుసుం చెల్లించాలని పేర్కొంది. కానీ ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ముక్కుపిండి మరి పరీక్ష ఫీజు పేరుతో అదనంగా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని స్కూళ్లలో ఆన్‌లైన్‌ ఖర్చులంటూ అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.వెయ్యికి పైగా, మరికొన్నిచోట్ల రూ. 2వేల నుంచి రూ.4వేల వరకు పరీక్ష ఫీజు పేరుతో వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.

350 స్కూళ్లు..6 వేల మంది విద్యార్థులు

జిల్లాలో సుమారు 350 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా, వాటిలో దాదాపు 6 వేల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించనున్న పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూళ్లు ప్రారంభమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వసూలు చేస్తున్నారా.. అనే అంశంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే నిర్ణయించింది. అంతకంటే అదనంగా వసూలు చేయొద్దు. అలాగే ఎవరైనా అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినా సంబంధిత పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.

– సీహెచ్‌.శ్రీనివాసరావు,

జిల్లా విద్యాశాఖ అధికారి

ఫ పదో తరగతి వార్షిక పరీక్షల రుసుం రూ.125గా నిర్ణయించిన ప్రభుత్వం

ఫ ప్రైవేట్‌ పాఠశాలల్లో తీసుకునేది మాత్రం రూ.వెయ్యికిపైగానే..

ఫ కొన్నిచోట్ల రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు..

ఫ ఆన్‌లైన్‌ ఖర్చుల పేరిట అదనంగా వసూలు చేస్తున్న యాజమాన్యాలు

ఫ జిల్లాలో 6 వేల మంది టెన్త్‌ విద్యార్థులు

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై విద్యాశాఖకు స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి అమలుపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఫీజు ఎంత చెల్లించాలి..? అదనంగా ఏయే రుసుములు వసూలు చేయవచ్చు..? అనే విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫీజుల వసూళ్లపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement