సూర్యాపేట (భానుపురి) : మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కోదాడ, హుజూర్‌నగర్ డివిజన్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను అనుసరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్ రాజు, డీపీఓ యాదగిరి, డీఎస్‌ఓ మోహన్‌బాబు పాల్గొన్నారు.
టెట్ మాక్ టెస్ట్‌కు
ఐదు కేంద్రాలు
సూర్యాపేట (సూర్యాపేటటౌన్) : టీజీ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రాక్టీస్ కోసం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 10 వరకు మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చావా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ కోదాడ, శ్రీ గురుకులం హుజూర్‌నగర్, స్వామి నారాయణ హైస్కూల్ దురాజ్‌పల్లి, ఎమ్మెస్సార్ హైస్కూల్ దురాజ్‌పల్లి, జెడ్పీహెచ్‌ఎస్ ఈటూరు కేంద్రాల్లో మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఉపాధ్యాయులు ఈ ఐదు కేంద్రాల్లో తమకు అనుకూలమైన ఏదో ఒక కేంద్రాన్ని సందర్శించి మాక్ టెస్ట్ రాయొచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ https://schoo ledu.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యల
పరిష్కారానికి కృషి
సూర్యాపేట అర్బన్ : విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ యాదగిరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకుని నేరుగా ఫిర్యాదుదారునికి సమాధానం తెలియజేస్తామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా విద్యుత్‌ను పొదుపు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని, గృహాల్లో సమస్య ఉందని వినియోగదారులు ఫిర్యాదులు అందజేశారని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ టెక్నికల్ ఇంజనీర్ ఆపరేషన్ సూర్యాపేట అధికారి వెంకటకృష్ణ, ఎస్ ఏఓ సత్యనారాయణ, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు, లైన్‌మెన్లు, సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.
విశేషంగా లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని మంగళవారం అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాంలకరణతో స్వామి అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణతంతు, విష్వక్సేనారాధన, పుణ్యాహవచన, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ప్రతిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.


