కుట్టు మిషన్ల మంజూరు కోసం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించాం. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వం ఆమోదించిన అనంతరం లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాం.
– విశాల్ ధారా, జిల్లా బీసీ సంక్షేమ అధికారి
సూర్యాపేట అర్బన్: జిల్లాలోని వెనుకబడిన తరగతులకు (బీసీ) చెందిన పేద మహిళలకు సొంతంగా జీవనోపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బీసీ కార్పొరేషన్ సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పేరిట మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే కుట్టుమిషన్లు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో
దరఖాస్తుల వడపోత
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఎనిమిది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్‌డీఓ కన్వీనర్‌గా నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, దివ్యాంగుల శాఖ ఏడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్‌బీఎమ్) తదితరులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుల వడపోత పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం జాబితాను ఆమోదించి యూనిట్లు మంజూరు చేయగానే పంపిణీ చేపడతారు.
14,926 మంది దరఖాస్తు
రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ల మంజూరు కోసం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి మొత్తం 14,926 మంది మహిళలు పోటీ పడుతున్నారు. అత్యధికంగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి 4,254 మంది, అత్యల్పంగా కోదాడ నుంచి 3,420 మంది, హుజూర్‌నగర్ నుంచి 3563, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 3689 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 4,000 కుట్టు మిషన్లను మంజూరు చేయనుంది.
ఎంపిక అర్హతలు ఇవే..
ఫ దరఖాస్తుదారులు తప్పనిసరిగా బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలై ఉండాలి.
ఫ వయోపరిమితి 18 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలి.
ఫ ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగి ఉండాలి.
ఫ గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2.00 లక్షలలోపు ఉండాలి.
ఫ ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఇందిరమ్మ కుట్టు మిషన్ మంజూరు చేస్తారు.
ఫ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి 14,926 మంది దరఖాస్తులు
ఫ అర్హులైన వారి ఎంపికకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు


