పాలకవీడు: గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం (వీబీజీ రాంజీ) పాలకవీడు మండలంలో దారితప్పుతోంది. మండల ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాబ్ కార్డుల జారీ, పని దినాల నమోదు, వేతనాల చెల్లింపుల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు.
జాబ్‌కార్డుల జారీలో జాప్యం..
అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు మంజూరు చేసి పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా స్థానిక అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పాలకవీడు మండలంలో జాన్‌పహాడ్‌కు చెందిన ఇద్దరు మహిళలు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని 20 రోజులు గడుస్తున్నా.. నేటికీ మంజూరు చేయలేదు. ఈ విషయమై ఏపీఓను సంప్రదించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాల చెల్లింపులో వ్యత్యాసం
పనులు పూర్తి చేసిన కూలీలకు వేతనాల చెల్లింపుల్లోనూ భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఒకే తరహా పని చేసినప్పటికీ.. కొందరి ఖాతాల్లో ఎక్కువ, మరికొందరి ఖాతాల్లో తక్కువ మొత్తం జమ అవుతోందని కూలీలు వాపోతున్నారు. తాము చేసిన పని దినాలు, వేతనాల గురించి తెలుసుకునేందుకు కంప్యూటర్ ఆపరేటర్‌ను సంప్రదిస్తే.. నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఉపాధి హామీ చట్టం అమలుపై అసంతృప్తి
పథకం అమలులో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న జాబ్ కార్డులను జారీ చేయాలని, వేతనాల వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
ఫ 20 రోజులైనా జారీ కాని జాబ్‌కార్డులు
ఫ వేతనాల చెల్లింపుల్లో తీవ్ర వ్యత్యాసాలు


