అధికారులే సూత్రధారులు | - | Sakshi
Sakshi News home page

అధికారులే సూత్రధారులు

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

కోదాడ : ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి మిల్లులకు సరఫరా చేసిన కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్‌ ధాన్యం మాయం కావడం వెనుక ఇంటిదొంగల హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అర్హతలేని మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేయడానికి జిల్లాలోని పౌరసరఫరాల శాఖ అధికారులే ప్రధాన కారణమని ఇటీవల జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు నిర్ధారించి సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. తాము కోరినట్లు ధాన్యం కేటాయించడంతో ఏకంగా ఒక జిల్లా స్ధాయి అధికారికి మిల్లర్లు రూ.22 లక్షల విలువైన ఇన్నోవా కారును బహుమతిగా ఇచ్చారని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఓ జిల్లాస్ధాయి అధికారి కుమార్తెకు కోదాడలో పెళ్లి జరిగితే అన్ని ఖర్చులు మిల్లర్లే పెట్టుకున్నట్లు తెలుసుకున్నారు. సదరు అధికారి ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా సూర్యాపేట జిల్లాలోని 43 మిల్లుల నుంచి ఏకంగా రూ.660 కోట్ల విలువైన సీఎంఆర్‌ బకాయిలు పేరుకుపోవడానికి మిల్లర్లతో అధికారులు కుమ్మక్కు కావడమే కారణమని ఉన్నతాధికారులు భావిస్తూ చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

ఆ ఒక్క కారణంతోనే సులువుగా బెయిల్‌!

కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై విజిలెన్స్‌ అధికారులు పకడ్బందీగా కేసులు నమోదు చేసి కోర్టులకు రిమాండ్‌ చేస్తున్నారు. అయినా వారికి సులువుగా బెయిల్‌ వస్తుండడంపై విజి లెన్స్‌ ఆరా తీయగా పౌరసరఫరాల శాఖ అధికారులే కారణమని గుర్తించారు. 2022 –23 యాసంగి, వానాకాలం సీజన్లలో అధికారులు మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యం సరఫరా చేశారు. ఈ క్రమంలో ముందస్తు దురాలోచన ఉన్న మిల్లర్లు తమ మిల్లుకు ధాన్యం దిగుమతి కాగానే వెంటనే తమ లెటర్‌హెడ్‌ మీద తమకు కేటాయించిన ధాన్యం బాగోలేదని, వెంటనే వెనక్కి తీసుకెళ్లాలని వినతిపత్రం ఇవ్వడంతోపాటు, దానిపై అధి కారుల సంతకం తీసుకుంటున్నారు. కొన్ని నెలల తర్వాత సీఎంఆర్‌ బియ్యం ఇవ్వాలని అధికారులు అడగగానే తాము అప్పుడే ధాన్యం బాగోలేదని లిఖిత పూర్వకంగా చెప్పినా అధికారులు పట్టించుకోలేదని తామిచ్చిన వినతిపత్రాలను కోర్టులకు చూపి ఈ ఒక్క కారణంతోనే సులువుగా బెయిల్‌ తెచ్చుకుంటున్నారు. మిల్లర్లు ధాన్యం సరిగా లేదని చెప్పిన సమయంలో అధికారులు ఎలా అంగీకరించారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

సీఎంఆర్‌ ధాన్యం మాయం చేయడంలో ఇంటిదొంగల హస్తం

కేటాయింపుల సమయంలోనే

భారీగా నజరానాలు

కేసులు నమోదైతే బెయిల్‌

పొందడానికీ సాయం

43 మిల్లుల్లో రూ.660 కోట్ల

సీఎంఆర్‌ బకాయిలు

శాఖ అంతర్గత విచారణలో

అక్రమాలు బహిర్గతం

కోదాడ పరిధిలోని బాలాజీనగర్‌లో ఉన్న రంగనాయక రైస్‌మిల్లుకు పౌరసరఫరాల శాఖ అధికారులు 2022–23 యాసంగిలో సీఎంఆర్‌ ధాన్యం కేటాయిస్తే బియ్యం ఇవ్వలేదు. దీంతో ఈ మిల్లులో ఉన్న రూ.3.35కోట్ల విలువైన 1,499.480 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం వేలం వేసినా వేలందారుకు కూడా ఇవ్వకుండా మిల్లు యజమానులు మాయం చేసినట్టు అధికారులు నిర్ధారించారు. ఇదే మిల్లుకు 2024–25 యాసంగి, 2025–26 వానాకాలం సీజన్లలో ధాన్యం కేటాయిస్తే రూ.13.35 కోట్ల విలువైన 3237.236 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాయం చేసినట్టు విజిలెన్స్‌ దాడుల్లో తేల్చి మిల్లు యజమానులపై కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. కొందరు అధికారులు లంచాలు పుచ్చుకొని ధాన్యం కేటాయించారని విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా చాలా మిల్లులకు సీఎంఆర్‌ ధాన్యం కేటాయించారు.

కొల్లగొట్టిన డబ్బుతో ఇతర వ్యాపారాలు

కోదాడ పట్టణ పరిధిలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న ఓ రైస్‌మిల్లు యజమాని 2022–23 సీజన్‌లోనే ఏకంగా రూ.65 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం మాయం చేశాడు. దీనిపై విచారణ చేసిన అధికారులు సదరు మిల్లును సీజ్‌ చేసి మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కూడా ప్రయోగిస్తామని తెలిపారు. దీంతో మిల్లు యజమాని కోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేయకుండా నాలుగేళ్లుగా ఉపశమనం పొందుతూనే ఉన్నాడు. ఇలా సీఎంఆర్‌ ధాన్యం కొల్లగొట్టిన డబ్బుతో పదుల సంఖ్యలో మిల్లర్లు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement