రిటైర్డ్‌ పోలీసులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ పోలీసులకు అండగా ఉంటాం

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

సూర్యాపేటటౌన్‌ : పోలీస్‌ శాఖలో ఎన్నో ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది సమాజంలో గౌరవప్రదంగా జీవనం సాగించేందుకు అండగా ఉంటామని ఎస్పీ నరసింహ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కుడకుడలోని కోమటికుంటకు వెళ్లే మార్గంలో రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. పదవి విరమణ పొందినప్పటికీ పోలీసుల మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని, ఒకరికొకరు అండగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్‌ సభ్యుల సంక్షేమ కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి, అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కార్యదర్శి పి.పుల్లయ్య, వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌గౌడ్‌, జిల్లా పోలీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ నాయక్‌, జనరల్‌ సెక్రటరీ వై.కిరణ్‌ పాల్గొన్నారు.

ఆర్థిక మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి

అధిక వడ్డీలు చెల్లిస్తామనే ఆకర్షణీయమైన హామీలు ఇచ్చే ఆర్థిక మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొందరు వ్యక్తులు అధిక వడ్డీల ఆశ చూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నారని, ఇలాంటి వడ్డీ హామీల వెనుక మోసపూరిత ఉద్దేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇలాంటి పథకాల్లో డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు కూడా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్పీ నరసింహ

మార్కెటింగ్‌ మోసాలతో జాగ్రత్త

మల్టీ లెవల్‌, చైన్‌ మార్కెటింగ్‌ల పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాలతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో, సరైన వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి పథకాలలో పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు వివిధ వాహనాలు, ఇతర వస్తువుల పేరుతో చేస్తున్న మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌తో మోసపోవద్దని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకుని మరికొందరు సభ్యులను చేర్పిస్తే భారీ మొత్తంలో కమిషన్లు వస్తాయని ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement