సాక్షి ఫొటోగ్రాఫర్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు | - | Sakshi
Sakshi News home page

సాక్షి ఫొటోగ్రాఫర్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

Aug 18 2026 8:04 AM | Updated on Aug 18 2026 8:04 AM

రామగిరి(నల్లగొండ) : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి నల్లగొండ జిల్లా ఫొటోగ్రాఫర్‌ కంది భజరంగ్‌ప్రసాద్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పోటీకి మొత్తం 510 ఫొటోలు పోటీ పడగా, వాటిలో ఉత్తమ ఫొటోలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. ఇందులో కంది భజరంగ్‌ప్రసాద్‌ తీసిన ఫొటో అవార్డుకు ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలుగా నిలిచిన వారికి త్వరలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన కారు..

వ్యక్తికి గాయాలు

మోత్కూరు : కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం అనాజిపురం చౌరస్తాలో సోమవారం జరిగింది. వివరాలు.. శాలిగౌరారం మండలం ఎన్‌జి కొత్తపల్లి గ్రామానికి చెందిన మురారిశెట్టి చంద్రయ్య కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం బైక్‌పై మోత్కూరుకు వచ్చి కిరాణ సామాను తీసుకొని స్వగ్రామానికి వెళ్తున్నాడు. అనాజిపురం చౌరస్తాలో రోడ్డు క్రాస్‌ చేస్తుండగా తిరుమలగిరి నుంచి వలిగొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య తలకు తీవ్ర గాయమైంది. అతడిని అంబులెన్స్‌లో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

బస్సు ఫుట్‌బోర్డుపై నుంచి

కిందపడిన ప్రయాణికుడు

కాలిపై నుంచి బస్సు వెళ్లడంతో గాయాలు

కట్టంగూర్‌ : ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డుపై నుంచి కిందపడిన ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కట్టంగూర్‌ మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. కట్టంగూర్‌ మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ముత్తయ్య సోమవారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు కట్టంగూర్‌లోని నల్లగొండ బస్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కాడు. బస్సు ఫుట్‌బోర్డుపై ఉన్న ముత్తయ్య లోనికి వెళ్తుండగా.. బస్సు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయటంతో ముత్తయ్య ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అతడి కాలుపై నుంచి బస్సు వెనుక టైరు ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముత్తయ్యకు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మద్యం మత్తులో

ఉరేసుకుని ఆత్మహత్య

పెద్దఅడిశర్లపల్లి : మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద సోమవారం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిపేటకు చెందిన బోదాసి శ్రీశైలం(39) హైదరాబాద్‌లో మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం హైదరాబాద్‌ నుంచి అంగడిపేటకు వచ్చాడు. సోమవారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు వెళ్దామని శ్రీశైలంను తనకు వరసకు బావ అయిన శివ అడిగాడు. కాసేపు ఆగు వస్తా అని చెప్పి శ్రీశైలం ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడి భార్య నాగలక్ష్మి ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో ఆమె తన కొడుకు శివకుమార్‌, అన్న శివతో కలిసి కిటికీలోంచి చూడగా శ్రీశైలం చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే శ్రీశైలం మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య చెబుతుండగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement