చిన్న నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదం! | - | Sakshi
Sakshi News home page

చిన్న నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదం!

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

కోదాడ రూరల్‌ : హైవే అథారిటీ, లారీ డ్రైవర్‌, పోలీసుల చిన్న నిర్లక్ష్యం కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల నుంచి ఐరన్‌ స్తంభాల లోడ్‌తో విజయవాడ వైపు వెళ్తున్న లారీ కోదాడ దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 3.36 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బ్రేకులు ఫెయిల్‌ కావడంతో డివైడర్‌ను ఎక్కినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. లారీ సంగం డివైడర్‌పై, సగం రోడ్డుపై ఉండి నిలిచిపోయింది. 3.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి విజయవాడవైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌.. ఈ లారీ దగ్గరకు వచ్చి తృటిలో తప్పించడంతో బస్సుకు గీతలు పడ్డాయి. దీంతో ఆ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్‌లు లారీ డ్రైవర్‌తో గొడవకు దిగారు. బస్సు డ్యామేజీకి డబ్బులు చెల్లించాలని ఒక డ్రైవర్‌ అక్కడే ఉండిపోగా మరో డ్రైవర్‌ బస్సును తీసుకొని వెళ్లిపోయారు.

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే..

తెల్లవారుజామూన 3.36 గంటలకు లారీ డివైడర్‌ ఎక్కి నిలిచిపోతే.. బస్సు 4.45 గంటలకు ఆ లారీని ఢీకొట్టగా ఆరుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. లారీ డివైడర్‌ ఎక్కిన వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం, తొలుత ఒక బస్సు వచ్చి స్వల్పంగా ఢీకొట్టిన వెంటనే గానీ ఇండికేటర్‌లు ఏర్పాటు చేసినా ఘోర ప్రమాదం తప్పేదని పేర్కొంటున్నారు. లారీ డివైడర్‌ ఎక్కిన గంట సమయం తర్వాత.. ఘోర ప్రమాదానికి గురైన బస్సు వచ్చి ఢీకొట్టింది. అంటే గంటకు పైగా అక్కడ రోడ్డుపై ప్రమాదకరంగా కంటైనర్‌ ఉందనే విషయాన్ని హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది గానీ, పోలీసులు గానీ గుర్తించలేకపోయారు. ఆ సమయంలో ఆ రెండు శాఖల వారు ఎక్కడ ఉన్నారనేది ప్రశ్న.

సంఘటన స్థలం పరిశీలన

ప్రమాదానికి గురైన బస్సును, కారణమైన లారీని ప్రమాద స్థలం నుంచి కొద్దిదూరంలో రోడ్డు పక్కన ఫంక్షన్‌హాల్‌ వెంట పెట్టారు. రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎన్‌.వాణి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులు, రవాణాశాఖ, రెవెన్యూ, హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైవే అథారిటీ అధికారులు 60 కిలో మీటర్లకు ఒక పెట్రోలింగ్‌ వాహనం నడిపితే ఎలా అన్ని ఆమె ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాలను ఇవ్వాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఆర్టీఓ పురుష్తోమరెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ జిలానీ, హైవే అథారిటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఉన్నారు.

నికలడగా క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి

ప్రమాదంలో గాయడిన 15 మంది ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కోదాడ రూరల్‌ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఫ్రెష్‌ బస్సు డ్రైవర్‌ మల్లికార్జున్‌ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

ఫ 3.36 గంటలకు లారీ డివైడర్‌ ఎక్కి నిలిచిపోయినట్లు గుర్తించిన అధికారులు

ఫ 4.45 గంటలకు బస్సు వచ్చి లారీని ఢీకొట్టింది

ఫ గంటకు పైగా లారీ హైవేపై నిలిచిపోయినా గుర్తించని పెట్రోలింగ్‌ సిబ్బంది

ఫ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదం తప్పేదంటున్న స్థానికులు

ఫ సంఘటన స్థలాన్ని పరిశీలించిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement