చౌటుప్పల్ : ఓ యువకుడి అమాయకత్వాన్ని గమనించిన కేటుగాడు తన మాయమాటలతో అతడిని నమ్మించాడు. మాటల్లో పెట్టి ఏటీఎం సెంటర్‌లో డ్రా చేసుకున్న నగదును బాధితుడి చేతుల్లోంచి తీసుకున్నాడు. ఫోన్ ద్వారా డబ్బులను పంపిస్తానని మాటల్లో పెట్టి ఉడాయించాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన ప్రభాకర్ చౌటుప్పల్ పట్టణంలో అద్దెకుంటూ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం పని ఉండడంతో డ్యూటీకి వెళ్లలేదు. సాయంత్రం డబ్బులు అవసరం రావడంతో ఇంటి నుంచి నడుచుకుంటూ బస్టాండ్ వద్దకు వచ్చాడు. పోచంపల్లి కో–ఆపరేటివ్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేస్తుండగా.. అప్పటికే అక్కడ ఉన్న ఓ 25ఏళ్ల యువకుడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ప్రభాకర్ ఏటీఎం నుంచి రూ.5వేలు డ్రా చేసి బయటకు వస్తుండగా.. సదరు కేటుగాడు ప్రభాకర్‌తో మాటలు కలిపాడు. ‘నేను ఫోన్ పే ద్వారా నీకు డబ్బులు పంపిస్తా.. నాకు క్యాష్ ఇవ్వు’ అని ప్రభాకర్‌ను నమ్మించాడు. సదరు కేటుగాడు ప్రభాకర్ చేతిలోని డబ్బులు తీసుకుని ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లు చేశాడు. రెండు నిమిషాల తర్వాత ప్రభాకర్ ఫోన్ చూసుకోగా డబ్బులు రాలేదు. ఐదు నిమిషాలలో తన ఫ్రెండ్ నుంచి డబ్బులు పంపిస్తానని ప్రభాకర్‌కు చెప్పి.. పక్కనే ఉన్న మొబైల్ షాపుకు వెళ్లి వస్తాను, అప్పటి వరకు నా ఏటీఎం కార్డు తీసుకొని రూ.20వేలు డ్రా చేసిపెట్టు అని పిన్ నంబర్ చెప్పి వెళ్లాడు. ఇది నిజమేనని నమ్మిన ప్రభాకర్ అతడిచ్చిన ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా పిన్ నంబర్ తప్పుగా తేలింది. పది నిమిషాలు ఎదురుచూసినా కేటుగాడు రాకపోవడంతో తాను మోసపోయానని ప్రభాకర్ గ్రహించాడు. వెంటనే ప్రభాకర్ పోచంపల్లి బ్యాంక్‌కు వెళ్లి సీసీ కెమెరాల్లో నమోదైన కేటుగాడి ఫొటోను తీసుకుని బస్టాండ్ పరిసరాల్లో కోసం వెతకడం ప్రారంభించాడు.
ఏటీఎం సెంటర్‌లో యువకుడికి మాయమాటలు చెప్పి డబ్బులు
తీసుకొని పరారైన కేటుగాడు


