పంచాయతీ నిధులు స్వాహా!
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
ఆత్మకూర్.ఎస్ : ఎలాంటి తీర్మానాలు లేకుండా పంచాయతీ నిధులను కాజేశారు.. పలువురు కార్యదర్శులు. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు మాయమాటలు చెప్పి చెక్కులపై వారి సంతకాలు తీసుకొని దొడ్డిదారిన స్వాహా చేశారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పంచాయతీలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. కాగా రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రాంట్స్ నిలిచిపోయాయి. దీంతో పలు మౌలిక వసతుల కల్పన కోసం తమ చేతిలోనుంచి డబ్బులు ఖర్చు చేశామని, ఇప్పుడు నిధులు వచ్చినందున డ్రా చేసుకునే వెసులుబాటు అధికారులు కల్పించారని కార్యదర్శులు నమ్మబలికారు. వారి మాటలు నమ్మి చెక్కులపై సంతకాలు చేసినట్లు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు వాపోయారు.
గుట్టు రట్టయ్యిందిలా..
దుబ్బతండా, ఆత్మకూర్.ఎస్, హాస్లాతండా, పాతర్లపహాడ్, తుమ్మలపెన్‌పహాడ్, నసీంపేట, కోటినాయక్‌తండా పంచాయతీల్లో నిధులు పక్కదారి పట్టాయి. అయితే చెక్కులపై సంతకాలు పెట్టిన విషయాన్ని తుమ్మలపెన్‌పహాడ్ సర్పంచ్, ఉప సర్పంచ్ తమ కుటుంబీకులతో పాటు వార్డు సభ్యులు, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమని తెలుసుకొని వెంటనే పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కార్యదర్శిని నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. పైగా నిధులు డ్రా చేయడం నా ఇష్టం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమంటూ దబా యించడంతో సర్పంచ్, వార్డు సభ్యులు ఎంపీడీఓ ను కలిసి ఫిర్యాదు చేశారు.
రికవరీ చేస్తారా, వదిలేస్తారా?
గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి నిండా రెండు నెలలు కాలేదు. తీర్మానాలు లేకుండా పంచాయతీ కార్యదర్శులు దొడ్డిదారిన నిధులు కాజేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే నిధులు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి నిలిచిపోయింది. తాజాగా వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కార్య దర్శులు స్వాహా చేయడంతో ప్రజలు అవసరాలు ఎలా తీర్చలంటూ సర్పంచ్‌లు వాపోతున్నారు. వచ్చే ఆర్థిక సంఘం నిధుల వరకు మళ్లీ ఇబ్బందులు తప్పవేమోనని, అధికారులు తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయా పంచాయతీ పాలకవర్గాలు కోరుతున్నాయి.
పాలకవర్గాల తీర్మానం లేకుండానే
డ్రా చేసిన కార్యదర్శులు
ఏడు గ్రామ పంచాయతీల్లో
రూ.15 లక్షల వరకు పక్కదారి?
ఎంపీడీఓకు ఫిర్యాదు
నిధులు స్వాహా జరిగిన
గ్రామ పంచాయతీలు ఇవే..
కోటినాయక్‌తండా రూ.1,20,500, దుబ్బ తండా రూ.64,500, ఆత్మకూరు.ఎస్ రూ.2,85,492, హాస్లాతండా రూ.1,17,000, పాతర్లపహాడ్ రూ.3,38,497, తుమ్మలపెన్‌పహాడ్ రూ.4,35,141, నసీంపేట పంచాయతీలో రూ.1,39,000 దొడ్డిదారిన కార్యదర్శులు డ్రా చేశారని ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆరోపించారు.
పాలకవర్గాల తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ ఖాతాల నుంచి నిధులు డ్రా చేసిన విషయమై విచారణ జరిపి కార్యదర్శులపై చర్యలు తీసుకుంటాం. రుజువైతే డ్రా చేసిన నిధులను రికవరీ చేస్తాం. ఏడు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు దొడ్డిదారిన నిధులు డ్రా చేసినట్లు మా దృష్టికి వచ్చింది.
– హసీం, ఎంపీడీఓ


