అభివృద్ధిని ప్రతి ఓటరుకూ వివరించండి
నేరెడుచర్ల : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కౌన్సిలర్ అభ్యర్థులకు సూచించారు. గురువారం నేరేడుచర్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరేడుచర్లలో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన చెత్త డంపింగ్‌యార్డును మరో చోటకు తరలించనున్నట్లు తెలిపా రు. మున్సిపాలిటీలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేశామన్నారు. హుజూర్‌నగర్‌లో వ్యవసాయ కళాశాల, కోదాడలో జవహర్ నవోదయ పాఠశాలకు ఇటీవల గవర్నర్ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీస్కాన్, డయాలసిస్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. నేరేడుచర్లలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేయించానని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు చెప్పారు. అలాగే షాదీఖాన కోసం రూ.75లక్షలు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. పాలకీడు మండలంలో 10 వేల ఎకరాల గిరిజన భూములను సస్యశ్యామలం చేయించేందుకు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తాను 1994 నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజాసేవకే అంకితం అయ్యానన్నారు. 2023 డిసెంబర్‌లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసు కోకుండా పని చేశానన్నారు. కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులు వంద శాతం గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్‌రెడ్డి, నూకల సందీప్‌రెడ్డి, నాయకులు బచ్చలకూరి ప్రకాశ్, భూక్యాగోపాల్, దనుంజయ నాయుడు, సురేష్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


