
కరువు తీరేలా వర్షం
జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం
ఫ అత్యధికంగా నాగారం మండలంలో 187.9 మి.మీ
ఫ పొంగిపొర్లిన వాగులు
ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం
సూర్యాపేట : కరువుతీరేలా వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో సరాసరి 43.1 మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాగారం మండలంలో 187.9 మి.మీ, తిరుమలగిరిలో 180.4 మి.మీ, తుంగతుర్తిలో 132.3 మి.మీ, జాజిరెడ్డిగూడెంలో 121.3 మి.మీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు పొంగిపొర్లి చెరువులు, కుంటలు అలుగులు పోశాయి. పలుచోట్ల లోలెవల్ బ్రిడ్జిల వద్ద వరద ఉధృతంగా ప్రవహించింది. వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, అదనపు కలెక్టర్ పి.రాంబాబులు సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు ప్రజలకు ధైర్యం చెప్పారు.
● నాగారం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఫణిగిరి, పసునూర్, పస్తాల, లక్ష్మాపురం, వర్థమానుకోట, నాగారం, డి.కొత్తపల్లి, ఈటూరు గ్రామాల్లోని చెరువులు అలుగులు పోస్తున్నాయి. వర్థమానుకోటలోని బిక్కేవారు అలుగుపోస్తోంది. పస్తాల, లక్ష్మాపురం, డి.కొత్తపల్లి గ్రామాల్లో ఉన్న బంధంల వద్ద(కల్వర్టులు) ప్రమాదకంగా నీరు ప్రవహిస్తోంది. నాగారం మండల కేంద్రంలోని పెద్ద చెరువు వరద తాకిడికి నాగారం–తుంగతుర్తి ప్రధాన రహదారి వెంట ఉన్న 11 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
● అర్వపల్లి మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. సూర్యాపేట – జనగాం హైవేలో పోలీస్‌స్టేషన్ రోడ్డు జలమయంగా మారింది. సుమారు 50 ఇళ్లు నీటమునిగాయి. కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలు చెరువును తలపించాయి. కేజీబీవీ నుంచి 60మంది బాలికలను ట్రాక్టర్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కోడూరు – తిమ్మాపురం రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. అర్వపల్లిలో కలెక్టర్ పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.
● తిరుమలగిరి మండలవ్యాప్తంగా అతిభారీ వర్షం పడింది. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు జలమయం కాగా.. వలిగొండ – తొర్రూర్ రూట్‌లో తొండ గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణం సాగుతుండడంతో భారీగా వరద నీరు చేరింది. ఇక్కడ రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. తొండ గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలోకి నీళ్లు చేరాయి. అంగన్‌వాడీ కేంద్రంలో బియ్యం, కోడిగుడ్లు తడిసిముద్దయ్యాయి. పలు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.
● మద్దిరాల మండలంలో భారీ వర్షం పడడంతో కుక్కడం, గుమ్మడవెల్లి, పోలుమళ్ల, చిననెమిల, కుంటపెల్లి గ్రామాల్లోని చెరువులు మత్తడి దూ కాయి. పలు కాలనీల్లో ఇళ్లు చుట్టూ నీళ్లు చేరాయి.
● సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, ప్రియాంక కాలనీ, ఆర్‌కే గార్డెన్స్, శ్రీరాంనగర్, తిరుమలనగర్ కాలనీల్లోకి వరద చేరింది. ఆయా ప్రాంతాలను అదనపు కలెక్టర్ పి.రాంబాబు, కమిషనర్ హనుమంతరెడ్డి పరిశీంచారు.
● ఆత్మకూర్ మండలం చివ్వెంల – ముకుందాపురం రోడ్డులో ఏపూరు బ్రిడ్జిపై నుంచి బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో రాకపోకలు నిలిచిపోయాయి.
● తుంగతుర్తి మండలంలో చాలా గ్రామాల్లో చెరువు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. సంగెం – కోడూరు రహదారిపై వరద ప్రవాహం అధికంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
మండలాల వారీగా వర్షపాతం (మి.మీ.)
మండలం వర్షపాతం
నాగారం 187.9
తిరుమలగిరి 180.4
తుంగతుర్తి 132.3
జాజిరెడ్డిగూడెం 121.3
నూతనకల్ 80.9
మద్దిరాల 69.7
సూర్యాపేట 49.2
చిలుకూరు 28.3
ఆత్మకూర్ (ఎస్) 23.8
గరిడేపల్లి 22.2
నేరేడుచర్ల 16.8
కోదాడ 6.9
మునగాల 9.8
హుజూర్‌నగర్ 11.2
పెన్‌పహాడ్ 7.8
మోతె 7.2
మేళ్లచెర్వు 7.3
చింతలపాలెం 5.5
చివ్వెంల 12.0
పాలకీడు 2.9
అనంతగిరి 1.9
మఠంపల్లి 1.9
నడిగూడెం 2.3

కరువు తీరేలా వర్షం

కరువు తీరేలా వర్షం

కరువు తీరేలా వర్షం