గణేశ్‌ ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించడం అవసరం | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించడం అవసరం

Aug 13 2025 7:30 AM | Updated on Aug 13 2025 7:30 AM

గణేశ్‌ ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించడం అవసరం

గణేశ్‌ ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించడం అవసరం

సూర్యాపేటటౌన్‌ : గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే వారు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో రానున్న గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, భద్రతా పరమైన చర్యల దృష్ట్యా పోలీసు శాఖ సూచించే నియమ నిబంధనలు పాటించాలని కోరారు. మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. పరిసరాలు అపరిశుభ్రంగా చేయవద్దని, డీజేలు పెట్టొదని, బాణసంచా పెల్చొద్దని సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని కోరారు. ప్రయాణికులు, సామాన్యులతో పాటు ఇతర మతస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేయడం మంచిదని సూచించారు. శాంతి సామరస్యానికి ప్రతీకగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు.

అన్ని శాఖలు టార్గెట్‌ పూర్తి చేయాలి

మోతె: వనమహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖలు మొక్కలు నాటి లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి(డీఆర్‌డీఓ) వి.వి. అప్పారావు సూచించారు. మంగళవారం మోతె మండల కేంద్రంలో ఫీల్డ్‌అసిస్టెంట్లతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం రాఘవాపురం ఎక్స్‌ రోడ్డు గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్‌ సైట్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. డీఆర్‌డీఓ వెంట ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నగేష్‌, ఈసీ శ్రీహరి, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌అసిస్టెంట్లు పాల్గొన్నారు.

‘కళ్యాణ లక్ష్మి’ కుంభకోణంలో షోకాజ్‌ నోటీసులు జారీ

కోదాడ: అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల కుంభకోణంలో మండలానికి చెందిన ఇద్దరు అధికారులకు కోదాడ ఆర్డీవో షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఈ మండల పరిధిలోని కొత్తగూడెంలో కూడా భారీ ఎత్తున కళ్యాణలక్ష్మి చెక్కులు పక్కదారి పట్టిన విషయంలో అధికారులు విచారణ చేయకుండా మండలానికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

14న వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ సెలక్షన్స్‌

సూర్యాపేట : చైనాలో జరిగే అండర్‌–15 వరల్డ్‌ స్కూల్‌ వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌ కోసం తెలంగాణ టీం సెలక్షన్‌ ట్రయల్‌లో భాగంగా సూర్యాపేట జిల్లా సెలక్షన్లను ఈనెల 14న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ ఎం.కిరణ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్‌లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రిపోర్ట్‌ చేయాలని కోరారు. వివరాలకు సెల్‌ నంబర్‌ 9848804353లో సంప్రదించాలని సూచించారు.

కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

సూర్యాపేటటౌన్‌ : నిత్యపెళ్లికొడుకుగా అవతారమెత్తిన కానిస్టేబుల్‌ కృష్ణంరాజును ఎస్పీ కె.నరసింహ మంగళవారం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజుకు 2012లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. మొదట సూర్యాపేటకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల కాపురం అనంతరం దంపతుల మధ్య వివాదం నెలకొంది. ఆమెతో విడిపోయేందుకు కృష్ణంరాజు రాజీ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన యువతిని కృష్ణంరాజు వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఆరు నెలలు కాపురం చేసి విడాకులు ఇవ్వకుండానే పరిష్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరు నెలల క్రితం సూర్యాపేటకు చెందిన బాలికను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా విడిపోయేందుకు ప్రయత్నాలు చేసి నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కానిస్టేబుల్‌ బాగోతం వైరల్‌గా మారడంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ కృష్ణంరాజు కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement