
ప్రథమ సంవత్సరంలో 450మంది చేరిక
కోదాడ: కొన్నేళ్లుగా అడ్మిషన్లులేక వెలవెలబోతున్న కోదాడలోని కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం వచ్చింది. కళాశాల స్వయంప్రతిపత్తిగా మారడం.. కోదాడలోని నాలుగు ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్లు తీసుకోకపోవడం ఈ కాలేజీకి కలిసి వచ్చింది. కొంతకాలంగా 200 మంది చేరడమే గగనమవుతున్న తరుణంలో ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్‌లో వివిధగ్రూపుల్లో కలిపి ఇప్పటి వరకు 450 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం విశేషం. బీఏ గ్రూప్‌లో 189 మంది, బీకాంలో 95 మంది, బీఎస్సీ పిజికల్ సైన్స్‌లో 101 మంది, లైఫ్ సైన్స్‌లో 48 మంది విద్యార్థులు చేరారు. విద్యార్థులు భారీ సంఖ్యలో చేరినప్పటికీ కళాశాలలో సరైన సౌకర్యాలు లేవనే విమర్శలున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్‌లో కంప్యూటర్లు పాతవి కావడంతో తరచూ మొరాయిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం వర్షానికి షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని కొందరు విద్యార్థులు తెలిపారు. వసతులను మెరుగు పర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫ కోదాడలోని కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం