
యోగా విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలి
హుజూర్‌నగర్ : యోగా విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని తెలంగాణ యోగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురికంటి వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని టౌన్‌హాల్లో మహాయోగా సేవ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా యోగా విద్య కరపత్రాన్ని స్థానికులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు యోగాను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్నారు. యోగా మంత్రిత్వ శాఖ, యోగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. యోగా జీవన శాస్త్రవేత్తలను నామినేటెడ్ ద్వారా చట్ట సభల్లోకి తీసుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన 50 వేల మంది యోగా సాధకులను నియమించి వారికి ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ తలంబ్రాలతో వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు.
పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మేళ్లచెరువు : పెన్షనర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హామీలను ఈ నెల 15 వరకు అమలు చేయని లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
వైభవంగా సౌర హోమం
అర్వపల్లి : తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో కాకులారపు రజిత, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్‌రావు, కె.సత్యనారాయణ, మణికంఠ, గిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, మోనూపాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు.

యోగా విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలి

యోగా విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలి