
నకిలీ హాజరుకు చెక్!
నాగారం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నకిలీ హాజరుకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఇ–కేవైసీ విధానం అమలు చేయనుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
అక్రమాలు ఇలా..
జిల్లాలో 23 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 2.63 లక్షల జాబ్ కార్డులు ఉన్నారు. అందులో 5.70 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరిలో ప్రస్తుతం పనులుచేస్తున్న వారు 2.15 లక్షల మంది ఉన్నారు. ఉపాధి హామీ పనులకు వస్తున్న కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు క్షేత్ర సహాయకులు నకిలీ ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు, ఒకరి పేరుమీది మరొకరు పనులకు వెళ్తున్నట్లు గుర్తించారు. మరోవైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయట పడడం, నగదు రికవరీలు చేయడం జరుగుతున్నా సిబ్బందిలో మార్పు కన్పించడం లేదు. వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్‌ఎంఎంఎస్ యాప్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్)ను తీసుకొచ్చింది. దీనిని సైతం క్షేత్రస్థాయి సిబ్బంది దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతర ఫొటోలతోపాటు ఉపాధి హామీ పని చేయకపోయినా చేసినట్లు అప్‌లోడ్ చేస్తున్నారని తేలింది. దీంతో కూలీలకు ఆశించిన స్థాయిలో వేతనాలు రావడం లేదు.
రోజుకు రెండుసార్లు ఫొటోలు అప్‌లోడ్..
ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టడానికి ఇ–కేవైసీ విధానం ద్వారా హాజరు తీసుకునే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీ అధికారులు ప్రస్తుతం కూలీల ఇ–కేవైసీని సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేయనున్నారు. ఈ పద్ధతి ప్రకారం పనులకు వచ్చిన వెంటనే కూలీల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తారు. తిరిగి నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తారు. ఒకే వ్యక్తి ఈ రెండు ఫొటోల్లో ఉంటే వేతనాలు మంజూరవుతాయి. లేదంటే వేతనాలు నిలిపివేస్తారు. ఈ విధానంపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇది అమలైతే నకిలీ హాజరుకు అవకాశం ఉండదు.
అక్రమాలకు అవకాశం ఉండదు
ఉపాఽధి హామీ కూలీలకు ప్రభుత్వం ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేయనుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కూలీల ఇ–కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. వివరాలు సేకరించడం పూర్తయిన తరువాత ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేస్తాం. ఇ–కేవైసీ హాజరుతో అక్రమాలకు అవకాశం ఉండదు.
–వి.వి అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట
ఫ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం
ఫ త్వరలో ఇ–కేవైసీ విధానం
ఫ కూలీల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
ఉపాధిహామీ పథకం వివరాలు
జాబ్ కార్డులు 2.63 లక్షలు
నమోదైన కూలీలు మొత్తం 5.7లక్షలు
పనులకు వెళుతున్న కూలీలు 2.15లక్షలు

నకిలీ హాజరుకు చెక్!