
ఇంకుడు గుంత.. తీర్చును చింత
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈ ఏడాది వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రజలకు నీటి కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమస్య అధిగమించాలంటే నీటిని భూమిలోకి ఇంకించడం ఒక్కటే మార్గం. వాన నీటిని ఒడిసి పట్టడం వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. వర్షపు నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు తవ్వినట్లయితే నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పుతాయి. ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసేలోపు విస్తృతంగా ఇంకుడు గుంతలు తవ్వితే మేలని నిపుణులు సూచిస్తున్నారు..
వార్డుకు పది చొప్పున తవ్వితే..
జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో మొత్తం 141 వార్డులు ఉన్నాయి. వార్డుకు 10 చొప్పున ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములై విస్త్రత ప్రచారం చేపడితే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ సీసీరోడ్లు నిర్మించడంతో వర్షం కురిసినా కూడా నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. సీసీ రోడ్ల పక్కన భారీ గుంతలు తవ్వి వాన నీళ్లు ఇంకేలా చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది. గుంతలపై ఇనుప జాలీలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే..
మున్సిపాలిటీల్లో కొత్తగా నిర్మించే ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించకుంటే అనుమతి నిరాకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాత నిర్మాణాల్లోనూ అ వకాశం ఉన్నచోట ఇంకుడు గుంతల ఏర్పాటుకు నో టీసులు జారీ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో బో రు ఉన్న ప్రతివారు ఇంకుడు గుంత తవ్వించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు.
ఫ గత వేసవిలో అడుగంటిన
భూగర్భ జలాలు
ఫ ఇబ్బంది పడిన ప్రజలు
ఫ నీటి సంరక్షణ పథకాలపై అవగాహన కల్పించాలంటున్న నిపుణులు
ఫ వర్షపు నీటిని ఒడిసి పడితే
తీరనున్న నీటి కష్టాలు
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలని చెబుతున్నాం. అలాగే అవసరం ఉన్నచోట ఇంకుడు గుంతలు నిర్మించాలని మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది.
–మున్వర్ అలీ,
మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరి
మున్సిపాలిటీ వార్డులసంఖ్య జనాభా
సూర్యాపేట 48 1,33,339
కోదాడ 35 75,093
హుజూర్‌నగర్ 28 35,850
తిరుమలగిరి 15 18,474
నేరేడుచర్ల 15 14,853