నారాయణరెడ్డి ఆశయాలు సాధించాలి
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో రావి నారాయణరెడ్డి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గన్నా చంద్రశేఖర్ మాట్లాడారు. రావి నారాయణరెడ్డి .. దేశంలో అత్యంత భారీ మెజారిటీతో గెలిచారని, తనకున్న 500 ఎకరాల సొంత భూమిని పేదలకు పంచిన త్యాగశీలి అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


