● చెరువులో పడి అన్నయ్య మృతి
● గోపినాథపురంలో విషాదఛాయలు
టెక్కలి రూరల్ : స్నేహితుల్లా పెరిగిన ఆ అన్నదమ్ములపై విధి కన్నెర్ర చేసింది. తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నించిన అన్నయ్యను మృత్యువు వెంటాడింది. ఈ విషాద ఘటన టెక్కలి మండలం గోపినాథపురంలో చోటుచేసుకుంది. మందస మండలం మకరజోల గ్రామానికి చెందిన గూన ధనుష్(22) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తమ్ముడు కుమార్తో కలిసి గోపినాథపురంలోని తాతయ్య సత్తారు మల్లయ్య ఇంటికి వెళ్లారు. మంగళవారం అన్నదమ్ములు కలిసి గ్రామ శివారున ఉన్న చెరువుకు స్నానానికి వెళ్లారు. కుమార్ కాలుజారి ఒక్కసారిగా చెరువులో పడిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకు చెరువులో దిగిన అన్నయ్య ధనుష్ తమ్ముడిని ఒడ్డుకు చేర్చి అతను నీటిలో మునిగిపోయాడు. వెంటనే తమ్ముడు స్థానికుల సహాయంతో చెరువులో దిగి అన్నయ్యను బయటకు తీశారు. పరిస్థితి విషమంగా మారడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తనను కాపాడే ప్రయత్నంలో అన్నయ్య మృతిచెందడంతో తమ్ముడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ధనుష్ విశాఖపట్నంలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గూన నారాయణరావు, తల్లి అప్పలకొండ ఉన్నారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.


