నరసన్నపేట: సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 21 నుంచి 23 వరకు స్కూల్ గేమ్స్‌లో భాగంగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ రవిబాబు తెలిపారు. మంగళవారం పాఠశాలను సందర్శించి ఏర్పాట్లపై పీడీలతో చర్చించారు. అండర్–17 విభాగంలో జరిగే ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చే యోగా క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. బాలురు, బాలికలకు వేర్వేరు కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. అంతకుముందు మిషన్ మార్చ్ 2027లో భాగంగా టెన్త్ విద్యార్థులకు ఉపాధ్యాయుల బోధనపై ఆరా తీశారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హెచ్‌ఎం వకులా రత్నమాల, ఉపాధ్యాయులకు డీఈఓ సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు శాంతారావు, దాలినాయుడు పాల్గొన్నారు.
నేటి నుంచి సరుబుజ్జిలి
అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని సరుబుజ్జిలి మండల అగ్రిగోల్డ్ బాధితులు ఈ నెల 18 నుంచి 21 వరకు ఒరిజినల్ బాండ్లను జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్‌స్టేషన్ భవనం పైభాగంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సమర్పించాలని సీఐడీ డీఎస్పీ కాళిదాస్ తెలిపారు. మంగళవారం పొందూరు మండలానికి చెందిన 282 మంది బాధితుల నుంచి 569 బాండ్లను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
నేడు ఆదిత్యుని హుండీ కానుకల లెక్కింపు
అరసవల్లి : ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీ కానుకల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటల నుంచి అనివెట్టి మండపంలో చేపడుతున్నట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న జరగనున్న హంసనావికోత్సవం (తెప్పోత్సవం) సందర్భంగా ఆహ్వాన పత్రికలను ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో కలిసి బుధవారం ఉదయం 8.30 గంటలకు అనివెట్టి మండపంలోనే ఆవిష్కరిస్తున్నట్లుగా ఈవో ప్రకటించారు.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష వాయిదా
శ్రీకాకుళం: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ప్రతిభా ఉపకార వేతన పథకం (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు డీఈఓ ఎ.రవిబాబు, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ కె.వి.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 29న జరగాల్సిన పరీక్షను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. డిసెంబర్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు గమనించాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ తేదీ మార్పు సమాచారాన్ని చేరవేయాలన్నారు. సందేహాల నివృత్తికి 7569633183 నంబరును సంప్రదించాలని సూచించారు.
వ్యక్తి అరెస్టు
కాశీబుగ్గ : మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఒకరి మృతికి కారణమైన వ్యక్తిని కాశీబుగ్గ సీఐ ఎం.అప్పారావు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 31న పలాసకు చెందిన సాహు కామేశ్ (60) కేటీ రోడ్డు దాటుతుండగా అదే సమయంలో సవర నాగేశ్ ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ఘటనలో కామేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తరలించగా అక్కడ మృతి చెందాడు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండు నిమిత్తం తరలించినట్లు సీఐ తెలిపారు.


