ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ సమీపంలోని బొబ్బిలిపేట జంక్షన్ వద్ద సీఎస్పీ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, ఎస్ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జలుమూరు మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పుట్ట ఆదినారాయణ (23) ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. బొబ్బిలిపేట జంక్షన్ వద్దకు చేరుకోగానే పాలకొండ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అదుపుతప్పి రోడ్డుపై బలంగా పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
బూర్జ : మండలం కేంద్రం బూర్జలో శుక్రవారం ఉద యం జరిగిన అగ్ని ప్రమా దంలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్తులంతా నాగులు చవితి సందడిలో ఉండగా తెలగ వీధిలో తిరుమలరెడ్డి శివశంకర్ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.కొద్దిసేపటికే పక్కనే ఉన్న రావూరి లక్ష్మీనారాయణ, బల్ల చాకలి, రావూరి కుమారస్వామి,అల్లు ముఖలింగం, తిరుమలరెడ్డి సూర్యారావులకు చెందిన పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఆరు కుటుంబాలకు చెందిన విలువైన వస్తువులతో పాటు నిత్యావసర సరుకులు కాలిబూడిదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.


