● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సునీత కొండబోలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలోని పేదలు, బలహీన వర్గాలు, అణగారిన ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేయడంలో పారా లీగల్ వాలంటీర్లు (పీఎల్‌వీలు) కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ సునీత కొండబోలు సూచించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందేలా వాలంటీర్లు కృషి చేయాలన్నారు. రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, పౌర బాధ్యతలు, ఉచిత న్యాయ సేవలు, పారా లీగల్ వాలంటీర్ల విధులు, బాధ్యతలపై వివిధ అంశాలను వివరించారు. బాధితుల సమస్యలను ఓపికగా వినడం, వారి వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడడం, పక్షపాతం లేకుండా వ్యవహరించడం, చట్టపరిధిలోనే సహాయం అందించడం వంటి అంశాల ప్రాధాన్యతను గురించి తెలియజేశారు. న్యాయ సేవలు కేవలం కోర్టులకే పరిమితం కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు కూడా చేరాలంటే వాలంటీర్ల భాగస్వామ్యం అవసరమన్నారు. శిక్షణ కార్యక్రమంలో శ్రీకాకుళం రిసోర్స్ పర్సన్ ఎ.భువనేశ్వరరావు, ప్యానల్ అడ్వకేట్ జి.ఇందిరా ప్రసాద్, పార లీగల్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.


