శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలబాలికల అథ్లెటిక్స్ బృందానికి ఎంపికై న అథ్లెటిక్స్ క్రీడాకారులు ఈనెల 13వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ వద్ద రిపోర్ట్ చేయాలని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శులు చల్లా జగదీష్, జీఎం జ్యోతిరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి వేదికగా జరిగే 70వ ఏపీ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ లగేజీతోపాటు 4 ఎలిజిబులిటీ ఫారాలు, జనన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్‌ఫొటోలు వంటి ధ్రువపత్రాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 94402 57020 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల టూల్ డౌన్
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం జిల్లా రెండో డిపోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు ఇవ్వని కారణంగా టూల్ డౌన్ చేసినట్లు ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. సకాలంలో ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని కారణంగా బుధవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ రెండో డిపో ఆవరణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావుకి జీతాలు అడిగితే బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. అందువలనే శ్రీకాకుళం జిల్లా రెండో డిపో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ రాష్ట్ర నాయకుడు దాసరి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా యూనియన్ జిల్లా నాయకులు, డిపో నాయకులు, శ్రీకాకుళం రెండో డిపో కార్మికులకు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేస్తూ టూల్ డౌన్ స్ట్రైక్ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో సుమారు 50 మంది కార్మికులు పాల్గొన్నారు.


