నరసన్నపేట: పంచాయతీ ఎన్నికల తేదీలను ఇష్టారాజ్యంగా మార్పు లు చేస్తే ఎలా? అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నరసన్నపేట నియోజకవర్గంలో రెండో ఫేజ్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కసారిగా మూడు రోజుల ముందుకు పోలింగ్ తేదీ మార్చడం సరికాదన్నారు. పంచాయతీ ఎన్నికలు ఎంతో కీలకమని, దూరప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఈ నెల 29కి చేరుకునేలా రిజర్వేషన్లు చేయించుకున్నారని, ఇప్పుడు 26కు మార్చితే ఎలా రాగలరని ప్రశ్నించారు. కూటమికి అనుకూలంగా ఉండేందుకు వైఎస్సార్ సీపీకి బలంగా ఉన్న మండలాల్లో కావాలనే ఇలా తేదీలు మార్చి ముందుకు జరుపుతున్నారని విమర్శించారు. నరసన్నపేట నియోజకవర్గంలోని మండలాలకు ముందుగా ప్రకటించిన మేరకు ఈ నెల 29నే పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.


