శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు కమిషనర్ జి.శ్రవణ్‌కుమార్ సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం బుధవారం పోలీసు అధికారులతో నిర్వహించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాలపై నాలుగు పోలీస్‌స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, ఎస్‌ఐలు, సీఐలతో పాటు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటి పరిస్థితుల పరిశీలన, అవసరమైన మౌలిక సదుపాయాలు, రహదారి సౌకర్యాలు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అప్పగించిన బాధ్యతలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


