‘పోలీసుల సహకారంతోనే రిగ్గింగ్‌ చేశారు’ | - | Sakshi
Sakshi News home page

‘పోలీసుల సహకారంతోనే రిగ్గింగ్‌ చేశారు’

Nov 12 2026 5:12 AM | Updated on Nov 12 2026 5:12 AM

టెక్కలి: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలిలో పోలీసు అధికారుల సహకారంతోనే టీడీపీ అభ్యర్థులు, నాయకులు రిగ్గింగ్‌ చేసుకున్నారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు నిరసనగా బుధవారం టెక్కలిలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్లు వేసింది మొదలు లెక్కింపు వరకు ప్రతిపక్షాల అభ్యర్థులు, వారి మద్దతుదారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారని ధ్వజమెత్తారు. చివరకు లెక్కింపు కేంద్రాల్లో సైతం దాడులు, దౌర్జన్యాలు చేశారని గుర్తు చేశారు. లెక్కింపు అనంతరం గెలిచిన అభ్యర్థులను ప్రకటించకుండా ఓటమి చెందిన అధికార పార్టీ వారిని విజేతలుగా ప్రకటించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అరాచకత్వాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. టెక్కలి –1వ ప్రాదేశికం ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన నంబూరు షణ్ముఖరావును టెక్కలి సీఐ విజయ్‌కుమార్‌ బలవంతంగా పోలీసులతో కారులో ఎత్తుకుపోయి అక్కవరం జంక్షన్‌లో విడిచిపెట్టారని, ఆ సమయంలో రిగ్గింగ్‌ చేశారని గుర్తు చేశారు. సంఘంలో పెద్ద మనుషులుగా చలామని అవుతున్నవారు, విశ్రాంత ఉద్యోగులు, వస్త్ర, మెడికల్‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, గ్రానైట్‌ వ్యాపారులు, వృద్ధులు, కొంతమంది రాధావల్లబాపురం గ్రామస్తులు దొంగఓట్లుకు లైను కట్టారని ఆరోపించారు. 8వ ప్రాదేశికం ఎంపీటీసీ గిరిజన అభ్యర్థి కిల్లాన డేనియల్‌ను పోలింగ్‌ కేంద్రానికి రాకుండా పోలీసులు, అధికార పార్టీ వారు అడ్డుకున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజలపై దౌర్జన్యాలు ఆపాలని, పాలకుల దుర్మార్గం నశించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో హనుమంతు ఈశ్వరరావు, నంబూరు షణ్ముఖరావు, కొల్లి యల్లయ్య, ఉర్జాన లక్ష్మణరావు, బగాది వాసుదేవరావు, పాలిన సాంబమూర్తి, సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్‌, క్రాంతి, ఐ.మల్లేశ్వరరావు, కేఎన్‌పీఎస్‌ నాయకులు బి.ప్రభాకరరావు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement