● 30 జెడ్పీటీసీలు, 523 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
● జెడ్పీటీసీ బరిలో 95 మంది, ఎంపిటీసీల బరిలో 1222 మంది
● 16,20,965 మంది గ్రామీణ ఓటర్ల కోసం 2004 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
● 7న డివిజన్ల వారీగా కౌంటింగ్కూ ఏర్పాట్లు మొదలు
అరసవల్లి: ‘పరిషత్’ పోలింగ్‌కు వేళయ్యింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో గ్రామీణ ఓటర్ల కోసం జిల్లా ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్నికల విధుల నిర్వహణకై సిబ్బందికి శిక్షణ ఇచ్చి, తగిన సామగ్రితో సిద్ధం చేసింది. జిల్లా లో మొత్తం ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ బా ధ్యతలను కట్టుదిట్టంగా నిర్వహించేలా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్.వెంకటరామన్ తదితర బృందం కసరత్తు పూర్తి చేసింది. అలాగే ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపట్టారు.
పోలింగ్ కేంద్రాలపై గట్టి నిఘా..
పరిషత్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 2004 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇందులో సమస్యాత్మక కేంద్రాలు 449 కాగా, 308 కేంద్రాలు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇప్పటికే ఆయా కేంద్రాల వద్ద పోలీసులు బందో బస్తు ప్రాథమిక చర్యలు మొదలుపెట్టేశారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద 757 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. పోలింగ్ కోసం 3646 పెద్ద సైజు బ్యాలెట్ బాక్సులు, 384 మధ్యస్థాయి సైజు బ్యాలెట్ బాక్సులు, 146 చిన్నసైజు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
సిబ్బందికి శిక్షణ పూర్తి..
ఈ నెల 5న జరుగనున్న పోలింగ్ అలాగే 7న జర గనున్న కౌంటింగ్ ప్రక్రియలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం 264 రూట్లలో 151 జోన్లుగా ప్రకటించారు. ఈ మేరకు పోలింగ్‌తో పాటు కౌంటింగ్‌లకు ప్రత్యేక శిక్షణ తో కూడిన సిబ్బందిని నియమించారు. ఈ మేరకు 31 మంది రిటర్నింగ్ అధికా రులు, 33 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 191 జోనల్ అధికారులు, 310 మంది మైక్రో అబ్జర్వర్లను ఎన్నికల అధికారులు నియమించారు. వీరితో పాటు 2004 పోలింగ్ కేంద్రాల్లో 2220 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), 2219 మంది ఏపీఓలు, ఇతర సిబ్బంది 8898 మందిని నియమించారు. అలాగే ప్రత్యేక వాహనాల కేటాయింపు కూడా చేపట్టారు.
7న మూడు డివిజన్ కేంద్రాల్లో కౌంటింగ్
గురువారం పోలింగ్ ప్రక్రియ ముగియగానే కట్టుదిట్టమైన భద్రతల నడుమ బ్యాలెట్ బాక్సులను ఆయా రెవెన్యూ డివిజన్ల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాల్లో భద్రపరిచేలా ఎన్నికల అధికారులు సన్నాహాలు చేయనున్నారు.
● శ్రీకాకుళం డివిజన్ (14) పరిధిలో శ్రీకాకుళం, గార, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి, పొందూరులతో పాటు సారవకోట (ప్రత్యేకంగా) మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాల–చిలకపాలెం వద్ద కౌంటింగ్ నిర్వహించనున్నారు.
● టెక్కలి డివిజన్ (09) పరిధిలో టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం, మెళియాపుట్టి, పాతపట్నం, ఎల్ఎన్.పేట, కొత్తూరు, హిరమండలం తదితర మండలాలకు చెందిన ఓట్లతో కూడిన బ్యాలెట్ బాక్సులను ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల (ఐతమ్) – కె.కొత్తూరు వద్ద భద్రపరిచి కౌంటింగ్ నిర్వహించనున్నారు.
● పలాస డివిజన్ (07) పరిఽధిలో పలాస, మందస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి తదితర మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను పలాస పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల– ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బ్యాలట్ బాక్సులను భద్రపరిచి ఈనెల 7న కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు. తదుపరి ఎన్నికల ఫలితాలను కూడా ఇదే రోజున అధికారికంగా వెల్లడించనున్నారు.
30 జెడ్పీటీసీలు, 523 ఎంపీటీసీల స్థానాలకు..
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల్లో భాగంగా మొత్తం 30 మండలాల్లో 30 జెడ్పీటీసీల స్థానాలకు మొత్తం 95 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, మొత్తం 542 ఎంపీటీసీల స్థానా లకు గాను 19 చోట్ల ఏకగ్రీవం కావడంతో మిగిలిన 523 ఎంపీటీసీ స్థానాలకు గాను మొత్తం 1222 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. ఇందుకోసం జిల్లాలో గ్రామీణ ఓటర్లు 16,20,965 మంది కాగా ఇందులో మహిళలు 8,16,164, పురుషులు 8,04,745 మంది, ఇతరులు 56 మంది ఉన్నారు. వీరికి ఓటరు స్లిప్పులు పంపిణీ కూడా జరిగినట్లుగా అధికారులు ప్రకటించారు.


