● పలాస, ఇచ్ఛాపురంలో కూటమి విజయం
కాశీబుగ్గ : పలాస, ఇచ్ఛాపురం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పలాస మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో టీడీపీకి 27, జనసేన మూడింట, బీజేపీ ఒకస్థానం వచ్చాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నాలుగు చోట్ల గెలుపొందారు. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సత్తా చాటారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా 11 పోస్టల్ బ్యాలెట్లలో ఐదు చెల్లుబాటు కాలేదు. మిగతావాటిలో వైఎస్సార్‌సీపీ చైర్ పర్సన్ అభ్యర్థికి నాలుగు, టీడీపీకి రెండు పడ్డాయి. అనంతరం ఓట్లు లెక్కించారు. జంట పట్టణాల చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థిని వజ్జ గంగాభవానీ ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని తాళాసు శ్రీపద్మపై గెలుపొందారు.
ఇచ్ఛాపురంలో..
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా కూటమి అభ్యర్థి ఆశి లీలారాణి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిలక రాజలక్ష్మి పై విజయం సాధించారు. మొత్తం 28 వార్డులకు ఎన్నిక జరగగా టీడీపీ 14, జనసేన 4, వైఎస్సార్‌సీపీకి 7, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు గెలిచారు. ఒకటి ఏకగ్రీవమైంది.
గెలిచేశామనుకుంటే..
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడిలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మూడో వార్డులో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పత్రి తవిటయ్య తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాలిన బాలాజీపై 78 ఓట్లు మెజారిటీతో గెలిచినట్లు కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చి ఆయన ప్రకటించారు. దీంతో ఆయన అనుచరులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. కానీ అధికారికంగా ప్రకటించే సరికి సీన్ రివర్స్ అయ్యింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాలిన బాలాజీ 37 ఓట్లు మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.


