ఒడిశా నుంచి వస్తున్నాం
ప్రత్యామ్నాయ మార్గం చూపాలి
ఇచ్ఛాపురం రూరల్: అర్నబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు నాలుగు గ్రామాల ప్రజలకు తీరని కష్టాలను మిగిల్చాయి. వరద ఉధృతికి బూర్జపాడు–డొంకూరు గ్రామాల మధ్య భారీ గండి పడడంతో డొంకూరు, శివకృష్ణాపురం, పెద్దలక్ష్మీపురం, చిన్న లక్ష్మీపురం మత్స్యకార గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఈ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాలన్నా, బయట నుంచి గ్రామాలకు రావాలన్నా ఉప్పుటేరు వరద ప్రవాహం అడ్డంకిగా మారింది.
ఉపాధ్యాయులకు తప్పని కష్టాలు
ఈ నాలుగు గ్రామాల్లోని ఒక ఉన్నత పాఠశాలతో పాటు మూడు ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 25 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. రహదారి తెగిపోవడంతో పాఠశాలలకు చేరుకోవడం వారికి సవాలుగా మారింది. విధులకు హాజరు కావాలంటే ఉప్పుటేరు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహంలో ప్రాణాలకు తెగించి వెళ్లాలా? లేక విధులకు దూరంగా ఉండాలా? అన్న సందిగ్ధంలో ఉపాధ్యాయులు పడుతున్నారు. విద్యార్థుల చదువులపైనా ఈ పరిస్థితి ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఎన్నికల వేళ అధికారులకు పరీక్ష
ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొనగా, మరోవైపు నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అధికార యంత్రాంగానికి కొత్త సవాలు ఎదురైంది. ఎన్నికల విధుల నిర్వహణ, సిబ్బంది రాకపోకలు, అత్యవసర సేవలు అందజేత ఎలా సాధ్యమన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాత్కాలిక రాకపోకల మార్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఉప్పుటేరుపై సురక్షితమైన దాటవేత సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శాశ్వతంగా రహదారి మరమ్మతులు చేపట్టి భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామాల్లో ఎవరికై నా అనారోగ్యం సంభవించినా, గర్భిణులకు ప్రసవ సమయం వచ్చినా, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎలా స్పందించాలన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వైద్య సిబ్బంది, రెవెన్యూ అధికారులు సైతం గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సేవలు అందకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద తగ్గే వరకు వేచి చూడడం మినహా మరోమార్గం కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
అర్నబ్‌తో నాలుగు మత్స్యకార గ్రామాలు అతలాకుతలం
బాహ్య ప్రపంచంతో బంధాలు తెగిన వైనం
గ్రామాలకు రాకపోకలు బంద్
అవస్థలు పడుతున్న ప్రజలు
డొంకూరు ప్రాంతంలో 10 మంది వరకు మహిళా ఉపాధ్యాయులం పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నాం. సుమారు 30 మీటర్లు మేర రోడ్డు కొట్టుకుపోవడంతో మధ్యలో ఉప్పుటేరు దాటితే గానీ పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉపాధ్యాయులమంతా ప్రత్యేక వాహనంలో 15 కిలోమీటర్లు అదనంగా ఒడిశాలోని సుమండి పైనుంచి పాఠశాలలకు రావాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు చాలా కష్టతరంగా ఉంది.
– జి.హేమకుమారి, హెచ్‌ఎం,
డొంకూరు ఉన్నత పాఠశాల
ఆరు రోజులుగా బాహ్య ప్రపంచానికి మా నాలుగు గ్రామాలు దూరంగా ఉన్నాయి. నాలుగు రోజులు గ్రామంలో విద్యుత్ లేకపోవడం, ప్రస్తుతం రోడ్డు గండి పడడంతో గ్రామాలకు అధికారులు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ఒడిశా రాష్ట్రం గుండా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూపాలి
– బుడ్డ దేవరాజు,
గ్రామస్తుడు, డొంకూరు


